పూర్ణిమ క్షేమంగా ఉంది

Update: 2017-07-17 03:46 GMT

కూకట్‌పల్లిలో అదృశ్యమైన బాలిక అచూకీ లభ్యమైంది. భాష్యం స్కూల్లో చదువుతున్న 14ఏళ్ల పూర్ణిమ గత నెల 7న పాఠశాలకు బయల్దేరి అదృశ్యమైంది. నిజాం పేటకు చెందిన బాలిక అదృశ్యంపై పోలీసులు ప్రత్యేక బృందాలతో గాలించినా చిన్న అచూకీ కూడా దొరకలేదు. బాలిక స్కూలుకు రాలేదనే సమాచారంతో అప్రమత్తమైన తల్లిదండ్రులు గాలించినా ఫలితం లేకపోవడంతో బాచుపల్లి పోలీసుల్ని ఆశ్రయించారు. బాలిక అచూకీ కనుగొనే విషయంలో పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తూ బాలల హక్కుల సంఘాన్ని కూడా ఆశ్రయించారు. దాదాపు 40 రోజులుగా బాలిక అచూకీ లేకపోవడంపై ఉత్కంఠ నెలకొంది. ముంబైలోని డొంగరి బాల్‌సుదార్‌ వసతి గృహంలో పూర్ణిమ సాయిని పోలీసులు గుర్తించారు. ఆదివారం ఆమె అచూకీ లభించడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

ముంబైకి పూర్ణిమ తల్లిదండ్రులు.....

బాలిక తల్లితండ్రులు హైదరాబాద్‌ పోలీసులతో కలిసి ఇప్పటికే ముంబై చేరుకున్నారు. దాదార్‌ పోలీసుల్ని సంప్రదించి బాలికను స్వస్థలానికి తీసుకురానున్నారు. స్కూలుకు బయల్దేరిన పూర్ణిమ అదే రోజు రైల్లో ముంబై చేరుకుంది. దాదార్‌ ప్రాంతంలో ఓ లాడ్జి ముందు తచ్చాడుతుండగా స్థానిక పోలీసులు గుర్తించి ప్రశ్నించారు. తన పేరు వనితశ్రీ అని తల్లిదండ్రులు చనిపోయారని చెప్పడంతో వారు బాలల వసతి గృహంలో చేర్పించారు. కొద్ది రోజుల తర్వాత అదే వసతి గృహంలో మరో తెలుగు బాలిక చేరడంతో ఆమెతో అసలు విషయాన్ని పూర్ణిమ సాయి బయటపెట్టింది. దీంతో ఆ విషయం వసతి గృహం నిర్వాహకులకు తెలియడంతో దాదార్‌ పోలీసులకు సమాచారం ఇచ్చారు. ముంబై పోలీసులు ఈ విషయాన్ని హైదరాబాద్‌ పోలీసులకు అందచేయడంతో కేసు కొలిక్కి వచ్చింది. పూర్ణిమ ఇల్లు విడిచి ఎందుకు వెళ్లిపోయిందో మిస్టరీ తేలాల్సి ఉంది.

Similar News