పవన్‌ను ఆటాడుకోవడంలో ఆయన ఏం తగ్గట్లేదు!

Update: 2016-11-16 19:40 GMT

ప్రజాస్వామ్యం అన్నాక ప్రజలందరూ సమానులు, కొందరు అధిక సమానులు అన్నట్లుగానే రాజకీయ ప్రత్యర్థుల విషయంలోనూ వైరుధ్యం ఉన్న నిర్వచనం మనకు అమల్లో ఉంటుంది. రాజకీయ ప్రత్యర్థులందరినీ నిందించాల్సిందే.. అయితే కొందరిని మాత్రం.. చాలా గొప్పవాళ్లంటూ కీర్తించాలి.. అన్నట్లుగా ఈ సామెతను తిరగరాసుకోవాలి.

అవును మరి.. తమను ఒకే తరహాలో తిడుతున్న విపక్షాల విషయంలో పాలకపక్షాలు స్పందించడం చూస్తే అలాగే అనిపిస్తుంది. ప్రత్యేకించి తెలుగుదేశాన్ని తీసుకుంటే.. వారిని ఒకే రకమైన తిట్లు జగన్ తిడితే ఒక రకంగా, పవన్ కల్యాణ్ తిడితే ఒక రకంగా ప్రతిస్పందిస్తారు. పవన్ తిట్లను చాలా సాదరంగా స్వీకరిస్తారు. ఆయన తిట్ల పట్ల సానుకూలంగా స్పందిస్తారు. ఎన్నికల్లో అధికారంలోకి రావడానికి పవన్ ఫ్యాక్టర్ వారికి ఉపయోగపడిన నేపథ్యంలో తెదేపా, భాజపా సీనియర్లు అలాగే మాట్లాడుతున్నారు. కానీ ఓ భాజపా నాయకుడు మాత్రం పవన్ ను ఓ రేంజిలో విమర్శించడమూ, సెటైర్ల్లు వేయడంలో చెలరేగిపోతున్నారు. ఏమాత్రం తగ్గడం లేదు. ఆయనే ఏపీ భాజపా ఇన్చార్జి సిద్ధార్థ నాధ సింగ్.

పవన్ కల్యాణ్ భాజపాను హోదా విషయంలో విమర్శించిన ప్రతిసారీ సిద్ధార్థనాధ్ సింగ్ చాలా తీవ్రంగా స్పందిస్తున్నారు. పవన్ కు అసలేమీ తెలియదంటూ దెప్పి పొడుస్తున్నారు. తాజాగా ఆయన ఏపీ నాయకులతో కలిసి ఢిల్లీలో మాట్లాడుతూ.. ప్యాకేజీపై పవన్ విమర్శల్ని తిప్పికొట్టారు. పవన్ సినిమాలకు నిధుల విడుదల ఆలస్యం అవుతుండవచ్చు గానీ.. ప్యాకేజీ నిధులు ఏపీకి సక్రమంగానే వెళుతున్నాయంటూ ఆయన సెటైర్లు వేశారు. ఇవన్నీ పవన్ దృష్టికి వెళ్తున్నాయో లేదో అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన భాజపాలో తాను తిట్టడానికి వెంకయ్యను తప్ప మరొకరి మీద చూపు పెడుతున్నట్లు లేదు. సిద్ధార్థ నాధ్ సంగతి తెలిస్తే.. ఈసారి మీటింగుల్లో ఆయనను కూడా ఓ ఆటాడుకుంటారేమో చూడాలి.

Similar News