నోటు కష్టాలు : బ్యాంకు సెలవులతో జనం హాహాకారాలు

Update: 2016-12-10 11:47 GMT

మూలిగే నక్క మీద తాటిపండు పడ్డ చందంగా ఉంది తెలుగు రాష్ట్రాల్లో జనం పరిస్థితి. అసలే నోట్లు సరిపడా అందుబాటులోకి రాక, బ్యాంకుల వద్ద డబ్బు కోసం గంటల తరబడి వేచి ఉంటున్న జనానికి రాబోయే మూడు రోజులు మరింత నరకం కనిపించే అవకాశం ఉంది. వరుసగా మూడు రోజులు బ్యాంకు సెలవులు కావడంతో.. బ్యాంకుల్లో దిక్కులేక, ఏటీఎంలలో కూడా డబ్బు అయిపోయే దుస్థితిని వారు ఎదుర్కొనే ప్రమాదం ఉంది. మామూలు రోజుల్లో బ్యాంకులు పనిచేస్తేనే ఏటీఎంలలో గంటకు మించి నగదు ఉండడం లేదు. మూడు రోజులు వరుస సెలవులు కావడంతో జనానికి కష్టాలు రెట్టింపు అయ్యాయి.

క్షేత్రస్థాయి పరిస్థితులు చూస్తే.. శనివారం ఉదయానికే చాలా ఏటీఎంల వద్ద నో క్యాష్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. అంటే రాబోయే మూడు రోజూలూ ఒక్కరూపాయి పుట్టే అవకాశం వారికి లేదన్నమాట.

ఒకవైపు అధికారులు నాయకులు 85 శాతం ఏటీఎంలలో నగదు అందుబాటులో ఉంది అని మీడియా ముందు చెబుతున్న మాటలన్నీ కల్లబొల్లి కబుర్లేనని రోడ్ల మీద యాతన పడుతున్న జనం వ్యాఖ్యాలు చేస్తున్నారు. వాస్తవానికి 10 నుంచి 15 శాతం ఏటీఎం లుమాత్రమే రోజుకు కొన్ని గంటలు మాత్రమే పనిచేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వీటినుంచి 2000 నోట్లే తప్ప.. నామమాత్రంగా అతి కొద్దిగా 500 నోట్లు వస్తున్నాయి. దీంతో జనానికి కష్టాలు మళ్లీ తిరగతోడుతున్నట్లు అవుతోంది.

కొన్ని చోట్ల జనం ఆగ్రహం అదుపు తప్పుతోంది. హైదరాబాదు టోలిచౌకి ప్రాంతంలో కట్టలు తెంచుకున్న కోపంతో జనం మోదీ వ్యతిరేక నినాదాలతో ఆందోళనకు దిగడంతో మెహదీపట్నం గచ్చిబౌలి మార్గంలో గంటలతరబడి ట్రాఫిక్ స్తంభించిపోయింది.

Similar News