తెల్లదొరలను ఓడించడంతో భారత్‌కు సెమీస్ బెర్త్ ఖరారు!

Update: 2016-10-19 01:34 GMT

ప్రపంచకప్ కబడ్డీలో భారత్ సెమీస్ లోకి ఘనంగా ప్రవేశించింది. మనం ఒకప్పట్లో తెల్లదొరలుగా పిలుచుకుంటూ ఉండిన ఇంగ్లాండు జట్టు మీద 69-18 తేడాతో అపురూపమైన విజయాన్ని నమోదుచేసి.. ఆషామాషీగా కాకుండా, తిరుగులేని శక్తిగా భారత్ సెమీస్ లోకి ఎంట్రీ ఇచ్చింది. పూల్ ఏ నుంచి ఆల్రెడీ కొరియా సెమీస్ కు అర్హత సాధించింది. ఆడిన 5 మ్యాచ్ లలో 4వ విజయం ద్వారా భారత్ కు ఇది సాద్యమైంది. దక్కింది నాలుగు విజయాలే అయినా.. భారీ స్కోరు వ్యత్యాసాలతో నెగ్గడంతో భారత్ మొత్తంగా 21 పాయింట్లు సాధించింది. దీంతో పూల్ లో మంచి ప్రతిభే కనబరచినా బాంగ్లాదేశ్‌కు సెమీస్ ఛాన్స్ దక్కలేదు.

మంగళవారం రాత్రి జరిగిన చివరి లీగ్ మ్యాచ్ లో భారత్ సహజంగానే ఆల్ రౌండ్ ప్రతిభను ప్రదర్శించి అపురూప విజయాన్ని సొంతం చేసుకోవడం విశేషం. ఇంగ్లాండు ఏ దశలోనూ భారత్ ను నిలువరించలేకపోవడం విశేషం. రెండు రోజుల కిందట అర్జంటీనాతో ఏకంగా 54 పాయింట్ల స్కోరు తేడాతో గెలిచి రికార్డు సృష్టించిన భారత్.. ఇంగ్లాండు మీద కూడా 51 పాయింట్ల తేడాతో నెగ్గింది.

పూల్ ఏ నుంచి కొరియా, భారత్ లు సెమీస్ కు ఖరారయ్యాయి. పూల్ బీ లో ఇరాన్ ఇప్పటికే ఆ దశకు చేరుకుంది. బుధవారం నాడు జపాన్- థాయిలాండ్ ల మధ్య కీలకమైన మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ లో విజేత కూడా సెమీస్ కు అర్హత సాధిస్తారు. వారి మ్యాచ్ ముగిసిన తర్వాతే... పాయింట్ల పట్టికను బట్టి.. భారత్ కు సెమీస్ లో ఎదురయ్యే ప్రత్యర్థి ఎవరో తేలుతుంది. క్రీడా నిపుణుల అంచనాల ప్రకారం పూల్ బీ నుంచి ఎదురు కాగల ప్రత్యర్థుల్లో ఇరాన్ భారత్ తో సమానంగా పటిష్టంగానే ఉంది. సెమీస్ లోనే ఇరాన్ తో తలపడాల్సి వస్తే గనుక.. ఆ మ్యాచ్ ఫైనల్ ను తలపించే స్థాయిలో రసవత్తరంగా ఉంటుందని పలువురు భావిస్తున్నారు.

Similar News