తెరాస ఎమ్మెల్యే చంద్రబాబును కలిసిన వేళ...

Update: 2016-11-29 17:59 GMT

రాష్ట్ర విభజన వలన అనివార్యంగా కలిగే నొప్పులు తెలంగాణ నాయకుడికి ఇన్నాళ్లకు తెలిసొచ్చాయో ఏమో గానీ.. తెరాస ఎమ్మెల్యే ఓ సరికొత్త డిమాండుతో ఏపీ సీఎం చంద్రబాబు దగ్గరకు వెళ్లారు. రవాణా పర్మిట్ల విషయంలో రెండు రాష్ట్రాలుగా చెలామణీలో ఉండడం వల్ల లారీ ఓనర్లపై పడుతున్న భారాన్ని ఆయన దృష్టికి తీసుకువెళ్లారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో నిత్యావసరాల ధరలు తగ్గాలంటే సింగిల్ పర్మిట్ విధానం అమలు చేయమంటూ చంద్రబాబుకు విన్నవించారు. దీనికి ఓకే చెప్పకపోయినప్పటికీ.. నిబంధనల ప్రకారం వెళ్దామని చంద్రబాబునాయుడు చెప్పడం విశేషం.

ఉమ్మడి తెలుగురాష్ట్రంలో పరిస్థితి వేరు. రాష్ట్రం రెండు ముక్కలు అయిన తర్వాత.. పర్మిట్ల పరంగా రెండు రాష్ట్రాల మధ్య తిరిగే లారీలకు కూడా భారం పెరిగింది. ఈ నేపథ్యంలో నారా చంద్రబాబు నాయుడును , తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు , మహబూబ్ నగర్ ఎమ్మెల్యే వి. శ్రీనివాస్ గౌడ్, తెలంగాణ లారీ యజమానుల సంఘం ప్రతినిధులతో పాటూ కలిశారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మధ్య సింగిల్ పర్మిట్ (కౌంటర్ సిగ్నేచర్ పర్మిట్) విధానం అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఇతర సరిహద్దు రాష్ట్రాలకు అమలు చేస్తున్న సింగిల్ పర్మిట్ విధానాన్ని తెలంగాణకు అమలుచేయాలని వీరు బాబును కోరారు. ఇందువల్ల నిత్యావసర వస్తువుల ధరలు తగ్గుతాయని, తెలుగు రాష్ట్రాల లారీ ఓనర్లపై భారం తగ్గుతుందని వివరించారు.

చంద్రబాబునాయుడు మాత్రం లారీ యజమానులతో సమావేశం నిర్వహించి త్వరలో నిర్ణయం తీసుకుంటామని చెప్పారే తప్ప.. వీరికి స్పష్టమైన హామీ ఇవ్వకపోవడం విశేషం. అయితే.. సచివాలయ భవనాల అప్పగింతలో తెలంగాణ సర్కారు కోరినట్లుగా ఏపీ స్పందించకపోవడం గురించి కూడా శ్రీనివాస గౌడ్ ప్రస్తావించి భంగపడినట్లు తెలుస్తోంది. విభజన తర్వాత 9,10 షెడ్యూల్ ప్రకారం ఆస్తుల విభజన పూర్తిచేయటానికి సహకరించాలని ఎమ్మెల్యే శ్రీనివాసగౌడ్ కోరడంతో, అసలు చట్టం ప్రకారం ఆస్తుల పంపకాన్ని చేపట్టాలని మొదటి నుంచీ విజ్ఞప్తి చేస్తున్నది తామేనంటూ చంద్రబాబు రిటార్టు ఇచ్చినట్లు తెలుస్తోంది. సచివాలయ భవనాల అప్పగింత విషయంలో మంత్రుల ఉప సంఘం నివేదిక రాగానే తగిన నిర్ణయం తీసుకుంటామని, తమవైపు నుంచి పూర్తి సహకారం ఉంటుందని చంద్రబాబు హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.

Similar News