తమిళనాడులో కొనసాగుతున్న జల్లికట్టు నిరసనలు

Update: 2017-01-18 10:39 GMT

తమిళనాడు మెరినా బీచ్ అట్టుడికిపోతోంది. జల్లికట్టుపై నిషేధం ఎత్తివేయాలంటూ వేలాది మంది యువత మెరీనాబీచ్ వద్ద నిరసనకు దిగారు. మంగళవారం రాత్రి నుంచి నిరసనలు కొనసాగుతున్నాయి. ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి తెచ్చి జల్లికట్టును కొనసాగించేలా ఆర్డినెన్స్ తేవాలని పెద్దయెత్తున తమిళనాడులో నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. దీనికి సంబంధించి ఆందోళనకారులతో చర్చించడానికి రాష్ట్రమంత్రులూ వెళ్లారు. కాని వారి చర్చలు సఫలం కాలేదు. జల్లికట్టుపై నిషేధం తొలగించాల్సిందేనంటూ నినాదాలు చేయడంతో వారు వెనుదిరిగారు.

మరోవైపు ఆందోళన జరిగే ప్రాంతంలో విద్యుత్తును తమిళనాడు ప్రభుత్వం నిలిపేసింది. ఆందోళనకారులను మెరీనాబీచ్ నుంచి పంపించివేసేందుకు విద్యుత్తు వ్యవస్థను నిలిపేయడంతో ఆందోళనకారులు రాత్రంతా దివిటీలతో తమ నిరసనలను తెలియజేశారు. దీనిపై కొందరు మద్రాసు హైకోర్టును కూడా ఆశ్రయించారు. అయితే తాము దీనిపై ఏమీ చేయలేమని, సుప్రీంకోర్టు ఉత్తర్వులకు విరుద్ధంగా ఎలాంటి నిర్ణయం తీసుకోబోమంది మద్రాస్ హైకోర్టు. తమిళనాడు ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం దీనిపై అత్యున్నతస్థాయి సమావేశాన్ని కూడా నిర్ణయించారు. ఇదివరకే తమిళనాడు ప్రభుత్వం జల్లికట్టుపై ఆర్డినెన్స్ ఇవ్వాలని కేంద్రాన్ని కోరింది. అయితే కేంద్రం అందుకు తిరస్కరించడంతో ప్రభుత్వానికి ఈ సమస్య పెను సవాలుగా మారింది.

మరోవైపు తమిళనాడు ముఖ్యమంత్రి పన్నీరుసెల్వం గురువారం ఢిల్లీ వెళుతున్నారు. ప్రధాని మోడీని కలిసి జల్లికట్టుపై నిషేధం తొలిగించేలా ఆర్డినెన్స్ ను తేవాలని పన్నీర్ కోరనున్నారు. తమిళనాడు ఎంపీలందరూ పన్నీర్ వెంట ప్రధానిని కలిసేందుకు వెళుతున్నారు. మెరీనా బీచ్ లో నిరసనల దెబ్బకు ముఖ్యమంత్రి ఢిల్లీ బాట పట్టారు.

Similar News