డబ్బు సంగతేమో.. ఎంట్రెన్సులన్నీ ఇక ఆన్‌లైన్ లోనే!

Update: 2016-11-30 12:42 GMT

నోట్ల రద్దు దెబ్బకు ఆన్‌లైన్ జపం ఒక్క ఆర్థిక లావాదేవీల విషయంలోనే కాదు.. అన్ని రంగాల్లోనూ వినిపిస్తోంది. ఆంధ్ర్రపదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలో జరిగే అన్ని రకాల ఎంట్రెన్సు పరీక్షలను ఆన్‌లైన్ లోనే నిర్వహించాలనే నిర్ణయానికి వచ్చింది. విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు దీనికి సంబంధించిన కసరత్తును ప్రారంభించారు. సమర్థులైన ప్రెవేటు ఏజన్సీలకు అప్పగించి.. వారి ద్వారా నిర్వహింపజేసేందుకు కసరత్తు జరుగుతోంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే వచ్చే ఏడాదినుంచే అన్ని రకాల ఎంట్రెన్సు పరీక్షలు ఆన్‌లైన్ విధానంలోనే జరుగుతాయి.

ఎంసెట్, ఐసెట్, ఈ సెట్ లాంటి అన్ని కామ‌న్ ఎంట్రెన్స్ ప‌రీక్ష‌ల‌ను ఇక నుంచి ఆన్ లైన్ లోనే నిర్వ‌హించ‌నున్న‌ట్లు రాష్ట్ర మాన‌వ వ‌న‌రుల అభివృద్ధి శాఖ‌ మంత్రి గంటా శ్రీనివాస‌రావు స్ప‌ష్టం చేశారు. మంగ‌ళ‌వారం ఆయ‌న విద్యాశాఖ ఉన్న‌తాధికారులు, ఎపి ఉన్న‌త విద్యామండ‌లి అధికారుల‌తో విజయవాడలో స‌మీక్ష‌ స‌మావేశం నిర్వ‌హించారు.

అన్ని ఎంట్రెన్స్ టెస్ట్ లు ఆన్ లైన్ లోనే నిర్వ‌హించే క్ర‌మంలో ఎంట్రెన్స్ టెస్ట్ ల‌ను నిర్వ‌హించే ఏజెన్సీల‌ను ఎంపిక చేసేందుకు ఏయే ఏజెన్సీలు స‌మ‌ర్థ‌వంతంగా ప‌నిచేస్తున్నాయో నివేదిక ఇవ్వాల‌ని ఉన్న‌త విద్యా కార్య‌ద‌ర్శిని ఆదేశించారు. 5 లోగా ఈ నివేదిక అంద‌జేయాల‌ని, అనంత‌రం త‌దుప‌రి నిర్ణ‌యం తీసుకుంటామ‌న్నారు. నివేదిక అంద‌గానే చ‌ర్చించి.. ఏయే వ‌ర్శ‌టీల‌కు ఏయే ఎంట్రెన్స్ ల నిర్వ‌హ‌ణ బాధ్య‌త‌ల‌ను అంద‌జేయాలో నిర్ణ‌యం తీసుకుంటామ‌ని మంత్రి తెలిపారు. అనంత‌రం పాఠ‌శాల విద్యాశాఖ అధికారుల‌తోనూ మంత్రి చ‌ర్చించారు.

ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో కొన్ని ఉద్యోగాలకు జరుగుతున్న పరీక్షలను ఆన్‌లైన్ లోకి తీసుకువచ్చారు. తెలంగాణలోనూ ఆన్ లైన్ రాతపరీక్షలు జరుగుతున్నాయి. ఆ నడుమ కర్ణాటక అధికారులు కూడా హైదరాబాదు వచ్చి ఇక్కడి ఆన్లైన్ పరీక్షల నిర్వహణ విధానాన్ని గమనించి వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏపీలో అన్ని ఎంట్రెన్సు పరీక్షలను ఈ పద్ధతిలో నిర్వహించడానికి పూనుకోవడం అనేది ఈ దిశగా పెద్ద ముందడుగుగా భావించాలి.

Similar News