చంద్రబాబుకు ‘కోహినూర్’ కావాల్సిందేనంట!

Update: 2016-11-17 00:25 GMT

బ్రిటిష్ వాళ్లు మన దేశాన్ని ఏలినప్పుడు ఇక్కడి అనేకానేక విలువైన సంపదల్ని అరాచకంగా తరలించుకుపోయారని, అందులో ప్రపంచంలోనే అత్యంత విలువైన కోహినూర్ వజ్రం కూడా ఒకటి అని .. మనం ఇప్పటికీ జ్ఞప్తికి వచ్చినప్పుడెల్లా ఆవేదన చెందుతూ ఉంటాం. భారత జాతి సంపద అయిన ఈ కోహినూర్ వజ్రాన్ని భారత ప్రభుత్వం ఇంగ్లాండు నుంచి తిరిగి వెనక్కు తేగలుగుతుందా అనే విషయంపై అప్పుడప్పుడూ సుప్రీం కోర్టులో పిల్ లు దాఖలు కావడమూ, జనంలో చర్చ సాగడమూ జరుగుతూ ఉంటుంది. భారత ప్రభుత్వం ఇంగ్లాండు నుంచి కోహినూర్ వజ్రాన్ని స్వదేశానికి తీసుకురావడం సంగతి ఏమో గానీ.. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మాత్రం తనకు ‘కోహినూర్’ కావాల్సిందేనంటూ పట్టుపడుతున్నారు.

అమరావతి నగర నిర్మాణాన్ని చంద్రబాబునాయుడు చాలా ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటూ ఉన్న సంగతి తెలిసిందే. అమరావతి నగరంలో వచ్చే నిర్మాణాలు అన్నింటి విషయంలోనూ నిర్దిష్టమైన ప్రమాణాలు తగ్గకుండా ఉండాలనే ఉద్దేశంతోనే.. అంతర్జాతీయ నిర్మాణ అనుభవం ఉన్న సంస్థలకు మాత్రమే పనులు అప్పగించాలనే ఆలోచనతో చంద్రబాబు కసరత్తు చేస్తున్నారు. ప్రతి నిర్మాణానికి సంబంధించిన ఆర్కిటెక్చరల్ డిజైన్లు తదితర అంశాలన్నిటినీ ఆయన స్వయంగా పట్టించుకుంటున్నారు.

ఇలాంటి నేపథ్యంలో అమరావతి నగరంలో ఎక్కడో ఒకచోట కోహినూర్ వజ్రాన్ని పోలిన ఆకృతిలో ఐకానిక్ భవనం ఒకటి ఉండాలని చంద్రబాబు కోరుకుంటున్నారట. ఈ మేరకు నగర నిర్మాణ డిజైన్లను రూపొందిస్తున్న ఆర్కిటెక్టులకు ఆయన ప్రత్యేకంగా పురమాయించారుట. అమరావతి నగరంలో ‘కోహినూర్’ కనిపించాల్సిందే అని చంద్రబాబు చెప్పినట్లుగా తెలుస్తోంది.

అయితే కోహినూర్ వజ్రం కృష్ణా జిల్లా, అమరావతి పరిసరాలు, కృష్ణా నదీ తీరంలోనే దొరికిందనే ప్రచారం కూడా ఒకటి ఉంది. సీఎం అనుకుంటున్నట్లుగా ఇక్కడ కోహినూర్ తరహా భవనం కడితే.. ఈ ప్రాంతంతో ఆ వజ్రానికి ఉండే చారిత్రక అనుబంధం కూడా ప్రతి ఒక్కరికీ గుర్తు చేసేలా ఉంటుందని అనుకోవచ్చు.

Similar News