చంద్రబాబు కష్టాలకు మరో వారంలో కాలం చెల్లుతోంది!

Update: 2016-11-16 18:42 GMT

చంద్రబాబునాయుడు రోజువారీ వ్యవహారాల్లో ప్రధానంగా నాలుగైదు కార్యాలయాలనుంచి పనిచేస్తూ ఉంటారు. నిజానికి రోజంతా కూడా ఇంట్లో ఉన్నా, క్యాంపు కార్యాలయంలో ఉన్నా సమీక్షలు, కాన్ఫరెన్సులు, భేటీలు అంటూ ఏదో ఒక కార్యక్రమంలోనే ఉండే చంద్రబాబునాయుడు కార్యకలాపాలు అమరావతి (బెజవాడ)కు మారిన నాటినుంచి నాలుగైదు కేంద్రాలనుంచి సాగుతూ ఉండేవి. ఉండవిల్లిలోని నివాసం, బెజవాడలోని క్యాంపు కార్యాలయం, కమాండ్ కంట్రోల్ కేంద్రం .. ఇలా చంద్రబాబు కార్యక్షేత్రాలు వేర్వేరుగా ఉండేవి. ఆయన రోజూ నాలుగైదు చోట్లకు తిరుగుతోంటే.. అధికారులు కూడా పరుగులు పెడుతూ ఉండేవారు. అయితే ఈ చంద్రబాబు కష్టాలకు కాలం చెల్లుతోంది. వచ్చే బుధవారం నుంచి చంద్రబాబునాయుడు పూర్తిస్థాయిలో వెలగపూడిలోని సచివాలయంలోని సీఎం అధికారిక కార్యాలయం నుంచి మాత్రమే విధులు నిర్వర్తించబోతున్నారు. ఆ మేరకు ఆయనకు, ఆయన వెంట అధికార్లకు తిరుగుడు శ్రమ తగ్గే అవకాశం కనిపిస్తోంది. అమరావతి నగర నిర్మాణం గురించి సమీక్షించిన సమావేశంలో ఈ సంగతిని కూడా చంద్రబాబు ఖరారుచేశారు.

కొత్త రాజధాని అమరావతి నగరానికే అలంకారంగా నిలిచే శాఖమూరు రిజర్వాయర్ నిర్మాణాన్ని వెంటనే చేపట్టి వచ్చే జూన్ నాటికి పూర్తిచేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నిర్దేశించారు. సెంట్రల్ పార్కుగా అభివృద్ధి చేస్తున్న శాఖమూరు రిజర్వాయర్ ప్రాంతాన్ని ప్రపంచంలోనే అత్యుత్తమ వాటర్‌ఫ్రంట్‌ పార్కుగా తీర్చిదిద్దాల్సి వున్నదని, వివిధ అంతర్జాతీయ నగరాల్లో వున్న నమూనాలను పరిశీలించి ఉత్తమ ఆకృతిని ఎంపిక చేయాలని ఆయన చెప్పారు. శాఖమూరు రిజర్వాయర్‌, పార్కులతో పాటు నీరుకొండ నుంచి ఉండవల్లికి వెళ్లే మార్గంలో వున్న 24 కిలోమీటర్ల కొండవీటివాగు వాటర్‌ఫ్రంట్ నిర్మాణాన్ని కూడా వెంటనే చేపట్టి సాధ్యమైనంత తొందరగా పూర్తిచేయాలని ఆదేశించారు.

అమరావతి నగర నిర్మాణ పురోగతిపై బుధవారం సాయంత్రం క్యాంపు కార్యాలయంలో రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ, రాజధాని నగర అభివృద్ధి-నిర్వహణ సంస్థల ఉన్నతాధికారులు, ఇతర అధికారులు, కన్సల్టెంట్లతో ముఖ్యమంత్రి సమీక్షించారు. 97 హెక్టార్లలో విస్తరించి వున్న శాఖమూరు రిజర్వాయర్‌ను అభివృద్ధి చేసి, దానికి అనుబంధంగా సుందరమైన ఉద్యానవనాన్ని ప్రపంచశ్రేణిలో తీర్చిదిద్దితే అది భవిష్యత్తులో రాజధానికి మకుటంగా మారుతుందని అభిప్రాయపడ్డారు. పరిపాలన నగరం మీదుగా వెళుతున్న కాలువ ప్రభుత్వ భవన సముదాయం మధ్యగా సచివాలయాన్ని రెండుగా చీల్చి వెళుతున్నందున ఆ ప్రతిపాదనపై పున:పరిశీలన జరపాల్సివుందని సీఆర్‌డీఏ కమిషనర్ చెరుకూరి శ్రీధర్ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువచ్చారు. వాస్తవానికి ఈ కాలువ ప్రభుత్వ పరిపాలన నగరానికి ప్రధాన ఆకర్షణగా, అత్యుత్తమ వాటర్ ఫ్రంటుగా వుంటుందని భావించినా, 200 మీటర్ల లోతున వుండే ఆ కాలువను ప్రత్యామ్నాయ మార్గానికి మళ్లించి ఆగ్రా తాజ్‌మహల్ తరహాలో ప్రత్యేక కాలువ మార్గాన్ని ఏర్పరచుకోవాలన్న ప్రతిపాదన ముఖ్యమంత్రి ముందు వుంచారు. దీనిపై నిపుణులతో సంప్రదించి నిర్ణయం తీసుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు. రాజధాని నగరంలో నిర్మించే వాటర్ ఫ్రంట్ నిర్మాణాలన్నీ ఆరు కాలాలలో ఎప్పుడు చూసినా ప్రత్యేకంగా కనిపించాలని, ముఖ్యంగా ఉద్యానవనాల ఏర్పాటుపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని చెప్పారు. ఈ పార్కులలో ఎటువంటి వృక్ష జాతులను నాటాలో ప్రపంచ ప్రఖ్యాతి పొందిన కడియం నర్సరీ యజమానులతో సంప్రదించాలని చెప్పారు. ఔషధ విలువలు వున్న వృక్ష జాతులను పెంచాలని సూచించారు. రాజధాని ప్రాంతంలోని రైతులు కొత్త రాజధానిలో వనాలను సంరక్షించే బాధ్యత తీసుకోవడానికి ఆసక్తి చూపుతున్నారని మంత్రి నారాయణ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకురాగా, వారికి ఉద్యాన వన సంరక్షణలో అవసరమైన నైపుణ్యం అందించేలా శిక్షణ ఇప్పించాలని చెప్పారు. రానున్న కాలంలో పార్కులలో వన సంరక్షణ బాధ్యతల్ని చూసేందుకు ప్రత్యేకంగా సంస్థాగతమైన ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం వున్నదని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు.

మన రాజధాని నగరాన్ని బ్లూ, గ్రీన్ సిటీగా రూపొందించాలని సంకల్పించామని, ఇప్పుడు దానికి అదనంగా గ్రీన్ హిల్స్ అనే పదాన్ని కూడా చేర్చుతున్నామని ముఖ్యమంత్రి అన్నారు. బెజవాడ, అమరావతి చుట్టుపక్కల వున్న పర్వతశ్రేణుల సౌందర్యాన్ని ఇటీవలే చూసి ముగ్ధుడినయ్యానని ప్రస్తావిస్తూ, కొత్త రాజధానికి ఇదే కచ్చితంగా ప్రధాన ఆకర్షణగా మారనున్నదని అన్నారు. నవ నగరాల్లో ప్రవహించే వాటర్ ఫ్రంట్ నిర్మాణాల్లో నీటి నిల్వ స్థాయి ఎప్పుడూ మధ్యతరహాలో వుండాలని, వరదలు వస్తే నీరంతా రిజర్వాయర్లలోకి వెళ్లిపోయేందుకు వీలుగా అధిక నీటిమట్టానికి అనుగుణంగా ఏర్పాట్లు చేయాలని చెప్పారు.

Similar News