గుడ్ బై డాడీ : సైకిలు పార్టీలో ముసలం!

Update: 2016-10-22 04:00 GMT

ఇది మన తెలుగు సైకిలు కాదు. ఉత్తరాదిలోని సైకిలు. యూపీలో త్వరలోనే అసెంబ్లీకి ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో.. ప్రస్తుతం అధికారంలో ఉన్న సమాజ్ వాదీ పార్టీలో ముసలం పుడుతోంది. ప్రస్తుత సీఎం అఖిలేష్ యాదవ్, తండ్రితో విభేదించి.. సమాజ్‌వాదీ నుంచి చీలిపోయి.. సొంతకుంపటి పెట్టుకునే ప్రయత్నాల్లో ఉన్నట్లుగా వార్తలు వస్తున్నాయి. అఖిలేష్ నిర్ణయాలను సమాజ్‌వాది అధినేత ములాయం తప్పుపట్టడం, పార్టీ గెలిస్తే సీఎం అభ్యర్థిని ఎమ్మెల్యేలే ఎన్నుకుంటారనే మాటలు అనడం , ములాయం కుటుంబంలో ఉన్న తగాదాలు అన్నీ కలసి పార్టీలో చీలికకు దారితీసే వాతావరణం ఉన్నదని పలువురు విశ్లేషిస్తున్నారు.

సమాజ్ వాదీ పార్టీనుంచి చీలిపోయి.. జాతీయ సమాజ్‌వాదీ పార్టీ లేదా ప్రగతిశీల్ సమాజ్‌వాది పార్టీ పేరుతో సొంత పార్టీ పెట్టుకోవాలని అఖిలేష్ యోచిస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. తండ్రితో విభేదాల పర్యవసానంగానే ఆయన ఇటీవలి కాలంలోనే ఉమ్మడి కుటుంబంగా ఉన్న తమ ఇంటినుంచి సీఎం అధికారిక నివాసానికి మారారు. అసెంబ్లీ ఎన్నికల్లో వ్యూహం గురించి చర్చించడానికి ములాయం సింగ్ యాదవ్ కీలక నేతలతో ఓ సమావేశం పెడితే.. దానికి అఖిలేష్ గైర్హాజరు కావడమూ చర్చనీయాంశంగానే ఉంది.

ఆ సమావేశం పూర్తవగానే, దానికి హాజరైన మంత్రులందరినీ తన నివాసానికి పిలిపించి మరో మీటింగు పెట్టుకుని, సరిగ్గా తమ పార్టీ ఎస్పీ రజతోత్సవాలు జరిగే సమయానికి రాష్ట్రమంతా వికాస్ రథయాత్ర పేరుతో తాను చేపట్టదలచుకున్న యాత్ర ఏర్పాట్ల గురించి వారితో చర్చించడం అనేది.. విభేదాలకు పరాకాష్ట అని పలువురు భావిస్తున్నారు.

మరోవైపు పార్టీ చీలిపోయే పరిస్థితి దాపురించకుండా చూడడానికి యాదవ్ కుటుంబం ప్రయత్నిస్తున్నట్లుంది. తమ పార్టీ గెలిస్తే అఖిలేషే మళ్లీ సీఎం అవుతారని చిన్నాన్న శివ్‌పాల్ యాదవ్ శుక్రవారం కూడా ప్రకటించారు. చీలిక వరకు వెళ్లకుండా, అఖిలేష్‌ను బుజ్జగించే ప్రయత్నాలు జరుగుతాయని అనుకుంటున్నారు.

Similar News