‘క్యాష్ లెస్’ దిశగా పరుగులు పెట్టిస్తున్న బాబు

Update: 2016-11-16 18:13 GMT

నల్లడబ్బు నియంత్రణకు పెద్ద నోట్ల రద్దు ద్వారా మోదీ ఒక ఆకస్మిక నిర్ణయం తీసుకుంటే.. అసలు ప్రజలకు పారదర్శక నిజాయితీతో కూడిన ఆర్థిక లావాదేవీలు అలవాటు అయ్యేలా చేయడంపై చంద్రబాబునాయుడు ప్రధానంగా దృష్టి పెడుతున్నారు. రాష్ట్రంలో నిరక్షరాస్యులు, గ్రామీణ ప్రాంతాల వారితో సైతం నగదు రహిత, స్మార్ట్ ఫోను ఆధారిత లావాదేవీలు చేయించేలా ప్రోత్సహించడానికి యంత్రాంగాన్ని ఆయన పరుగులు పెట్టిస్తున్నారు. తాజాగా జరిగిన కలెక్టర్ల సమావేశంలోనూ.. ఆన్ లైన్ వ్యవహారాలను పెంచడానికి మార్గాల గురించే చర్చ అధికంగా సాగడం గమనార్హం.

వేయి, ఐదువందల నోట్ల రద్దుతో ద్రవ్యచలామణీ, ప్రజల కష్టాలపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బుధవారం సీఎంఓ నుంచి జిల్లా కలెక్టర్లతో విడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సామాన్య ప్రజలు, దినసరి కూలీలు, అల్పాదాయ వర్గాల వారు అందరూ ఇబ్బందులు పడుతున్నారని, విపత్తుల నిర్వహణ సమయంలో పనిచేసిన విధంగా పనిచేయాలని ముఖ్యమంత్రి కలెక్టర్లకు, యంత్రాంగానికి పిలుపునిచ్చారు. ఆన్ లైన్ ట్రాన్సాక్షన్ విధానాన్ని ప్రోత్సహించాలని కోరారు. కిరాణా దుకాణాల్లో స్మార్టు ఫోను వినియోగంపై అవగాహన కల్పించాలని విజ్ఞప్తి చేశారు. డబ్బు చలామణీ, ప్రజల కష్టాలపై చర్చించి కలెక్టర్లకు ఆయన తగిన సూచనలిచ్చారు. ‘ ఈ కష్టాలు తీర్చడానికి మనం విపత్తు నివారణ సమయంలో పనిచేసినట్లు పనిచేయాలి. ప్రజలు కష్టాల్లో ఉన్నారు. నల్లధనాన్ని అరికట్టి దేశ ఆర్ధిక వ్యవస్థను చక్కదిద్దే ప్రయత్నంలో ప్రధాని ప్రధాని మోడీ సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారు. కొన్ని కష్టాలు వచ్చాయి. చక్కదిద్దుకుందాం. ప్రభుత్వ యంత్రాంగం ప్రజల కష్టాలు తీర్చడంలో ఈ సమయంలో అండగా నిలవాలి’ అని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. నగదు చలామణీపై నాలుగు రోజులుగా పర్యవేక్షిస్తున్నానని చెప్పారు.

ఏటీఎంలలో డబ్బులేదని, మూసివేశారని.. ఇటువంటి సమాధానాలు వినపడకూడదని, ఆంధ్రప్రదేశ్ కు అత్యధికంగా డబ్బు పంపాలని కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీని, రిజర్వు బ్యాంకు గవర్నరును కోరామన్నారు. గురువారం కలెక్టర్లు జిల్లాల్లో ముఖ్య వ్యాపారులు, ఎక్కువ లావాదేవీలు జరిపే వాణిజ్య సంస్థల ప్రతినిధులు, రేషన్ డీలర్లతో సమావేశం నిర్వహించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.

జన్ ధన్ అక్కౌంట్ల ద్వారా ఉపాధి హామీ కూలీల వేతనం చెల్లించే విధానాలు తీసుకురాబోతున్నారు.

జన్ ధన్ అక్కౌంట్లకు సీడింగ్ ఇచ్చి, మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకం కూలీలకు చెల్లింపు నగదు బ్యాంకుల్లో వారి అక్కౌంట్లలో వేయాలని ముఖ్యమంత్రి కోరారు. కూలీలు, పేద వర్గాలు, రెక్కాడితే డొక్కాడని జీవులు ఇబ్బంది పడకుండా చిన్న నోట్లను ఏటీ ఎంలలో అందుబాటులో ఉంచాలని బ్యాంకర్లకు ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు. ఒక్కో ఏటీఎంలో, ఒక్కో బ్యాంకులో ఎన్నెన్ని లావాదేవీలు జరిగాయో నివేదికలు సిద్ధంచేసుకోవాలన్నారు. ఇదిలా ఉంటే రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా ప్రతినిధులతో ముఖ్యమంత్రి చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. జనాభా ప్రాతిపదికన ఆంధ్రప్రదేశ్ కు నగదు పంపించాలని కోరారు. గ్రామాలలోకి వచ్చి పరిస్థితిని చూస్తే అర్ధమవుతుందని వారితో అన్నారు. ప్రజలకు వాస్తవాలు చెప్పాలి, రూ 100, రూ. 50 నోట్లను అన్ని ఏటీఎంలలో అందుబాటులోకి తేవాలని కోరారు.

చంద్రబాబు ప్రయత్నాలు గనుక ఫలించి ఆచరణలో ఆన్ లైన్ లావాదేవీలు పెరిగితే.. మోదీ ప్రయత్నంతో సమానంగా.. జనానికి ఉపయోగకరమైన, నల్లధనం కట్టడికి నిశ్చితమైన ప్రయత్నంగా దీనిని అభివర్ణించవచ్చు.

Similar News