కేసీఆర్‌పై లెఫ్ట్ నాటుతున్న అనుమానాల సంగతేంటి?

Update: 2016-11-28 08:00 GMT

తెలంగాణ ముఖ్యమంత్రి నోట్ల రద్దు పర్యవసానంగా ఏర్పడుతున్న కష్టాల మీద తొలిరోజుల్లో ఒక రేంజిలోనే ఆగ్రహావేశాలు వ్యక్తంచేశారు. తెలంగాణ రాష్ట్రానికి పెనునష్టం వాటిల్లినదంటూ లెక్కలు తీశారు. ఏయే రంగాలు ఏయే రకాలుగా కుదేలయ్యాయో.. ఏయే రంగాలద్వారా ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం ఎలా సన్నగిల్లిపోయిందో.. ప్రభుత్వం ఇబ్బంది పడుతున్నదో ఆయన పదేపదే ప్రస్తావించారు. కానీ.. ప్రధాని మోదీకి లేఖ రాసి, ఢిల్లీ వెళ్లి మోదీని కలిసి వచ్చిన తర్వాత.. తెలంగాణ ప్రభుత్వం తరఫున నుంచి నోట్ల రద్దు పర్యవసానాలపై ప్రతికూలంగా ఒక్క మాట కూడా వినిపించడం లేదు. ప్రభుత్వానికి గానీ ప్రజలకు గానీ ఎదురవుతున్న ఇబ్బందుల ప్రస్తావన కూడా లేదు. మొత్తం సీన్ మారిపోయింది. పైపెచ్చు.. అదేదో ఎన్డీయే భాగస్వామ్య పార్టీ పాలనలో ఉన్నట్లుగా.. మోదీ చెబుతున్న వాటికెల్లా తెలంగాణ ప్రభుత్వం కూడా సహకరిస్తూ ఆయన మాటల్ని ఆచరణలో పెట్టడానికి కసరత్తు చేస్తూ ఉన్నది. అందుకే కేసీఆర్ మీద నరేంద్రమోదీ ఏదైనా మ్యాజిక్ ప్రయోగించారా? అనే అనుమానం పలువురికి కలుగుతోంది.

సరిగ్గా ఇదే విషయంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి కూడా ప్రజల్లో కొత్త అనుమానాలు నాటుతున్నారు. నోటు కష్టాలపై మోదీ సర్కారుకు వ్యతిరేకంగా సాగిస్తున్న ఉద్యమంలో భాగంగానే ఆయన కేసీఆర్ మీద కూడా విమర్శలు చేస్తున్నారు. కేసీఆర్ ముందు నోటు కష్టాల మీద గళమెత్తినా, ఢిల్లీ వెళ్లి వచ్చిన తర్వాత సైలెంట్ అయిపోయారని అంటున్నారు.

అయితే కొందరు భావిస్తున్నదేంటంటే.. ప్రధాని నోట్ల రద్దు ద్వారా ఆశిస్తున్న వాస్తవ ప్రయోజనాల గురించి వ్యక్తిగతంగా వివరించిన దానితో కేసీఆర్ కన్విన్స్ అయ్యారని అనుకుంటున్నారు. కాబట్టే ఢిల్లీ యాత్ర తర్వాత తెలంగాణ ప్రభుత్వ వైఖరిలో మార్పు వచ్చిందని, రాష్ట్రం మొత్తాన్ని డిజిటల్ ఆర్థిక లావాదేవీల నగరంగా మార్చడానికి ఆయన కసరత్తు చేస్తున్నారనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తం అవుతోంది.

Similar News