కేసీఆర్ ఔదార్యం : సలహాదారులుగా పునరావాసం

Update: 2016-11-30 23:00 GMT

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తన మార్కు పదవుల పంపకం ఏ రేంజిలో ఉంటుందో మరో మారు చాటి చెప్పారు. ప్రభుత్వం ఏర్పాటు అయిన కొత్తల్లో సలహాదారులు, ఇంకా రకరకాల పేర్లు పెట్టి కేబినెట్ హోదాతో కావాల్సని వారందరికీ పదవులు కట్టబెట్టేసి ఓ పెను వివాదానికి కేసీఆర్ కారణమైన సంగతి తెలిసిందే. ఆ తర్వాత.. కోర్టు అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో కొన్ని నిర్ణయాల్ని నియామకాల్ని వెనక్కు తీసుకున్నారు. తాజాగా మళ్లీ అదే దూకుడుతో అయినవారికి పదవులు కట్టబెట్టేస్తున్నారు. తాజాగా ఆయన మాజీ ఎంపీ, కాంగ్రెస్ నుంచి తెరాసలోకి రెండుసార్లు వచ్చిన జి. వివేక్ కు ప్రభుత్వ సలహాదారు పదవిని కట్టబెట్టేశారు.

నిజానికి తెలంగాణలో బుధవారం నాడు రెండు సలహాదారుల పదవులు భర్తీ అయ్యాయి. ఇదే రోజున పదవీ విరమణ చేసిన ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ రాజీవ్ శర్మను ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రప్రభుత్వానికి ప్రధాన సలహాదారుగా నియమించారు. రాజీవ్ శర్మ స్థానంలో ప్రదీప్ చంద్ర కొత్త చీఫ్ సెక్రటరీ అయ్యారు. రాజీవ్ శర్మ పదవీవిరమణ సత్కారం సందర్భంగా ఏర్పాటుచేసిన సభలో కేసీఆర్ మాట్లాడుతూ.. ఆయనను ప్రస్తుతిస్తూ.. రాష్ట్ర ప్రభుత్వానికి ప్రధాన సలహాదారు పదవిలో కనీసం పదేళ్లు అయినా రాజీవ్ శర్మ సేవలు అందించాలని తాను కోరుకుంటున్నట్లుగా వెల్లడించారు. అంటే మళ్లీ రాష్ట్రంలో తెరాస సర్కారే ఏర్పడితే గనుక.. రాజీవ్ శర్మ ఈ సలహాదారు పదవిలో సుదీర్ఘ కాలం కొనసాగడం గ్యారంటీ అని సంకేతం ఇచ్చారు.

అయితే మరో ఉత్తర్వుల్లో కాంగ్రెస్ పార్టీలో ఉండగా ఎంపీగా పనిచేసిన జి.వివేక్ కు కేసీఆర్ సలహాదారు పదవిని కట్టబెట్టారు. అంతర్రాష్ట్ర వ్యవహారాల సలహాదారుగా ఆయనను కేసీఆర్ నియమించారు. వివేక్ తొలుత కాంగ్రెస్ పార్టీలో ఉంటూ ప్రత్యేక రాష్ట్ర డిమాండ్ విషయంలో స్పందించడం లేదనే కారణం చూపి, తెరాసలో చేరారు. చాలా పెద్దఎత్తున కార్యక్రమం నిర్వహించి పార్టీలో చేరిన ఆయనకు ఇక్కడి నాయకులతో పెద్దగా పొసగలేదు. ఈలోగా కాంగ్రెస్ తెలంగాణ ఇవ్వాలనే నిర్ణయం తీసుకోవడంతో మళ్లీ ఆ పార్టీలోకి వెళ్లిపోయారు. ఎటూ తెలంగాణ ఇచ్చేశాం గనుక.. తామే గెలుస్తాం అని కాంగ్రెస్ విర్రవీగిన నేపథ్యంలో ఆ పార్టీ తరఫునే సార్వత్రిక ఎన్నికల్లో ఎంపీగా బరిలోకి దిగారు. ఓటమి పాలయ్యారు. కొన్నాళ్లు స్తబ్ధుగా ఉన్న తరువాత.. ఇక కాంగ్రెస్ కు భవిష్యత్తు లేదని తలపోశారో ఏమోగానీ.. మళ్లీ గులాబీ తీర్థం పుచ్చుకున్నారు. దీంతో ఆయన రెండుసార్లు పార్టీలో చేరినట్లు అయింది.

రాజీవ్ శర్మ కు పదవిని కట్టబెట్టడం ఆయన అనుభవం మరియు రాష్ట్ర ప్రభుత్వ అవసరాల దృష్ట్యా కీలక నిర్ణయం కాగా, జి. వివేక్ కు కూడా పదవి కట్టబెట్టడం అనేది.. రాజకీయ పునరావాసం కల్పించే చర్యలో భాగమేనని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.

Similar News