కటకటాల వెనక్కి కానిస్టేబుల్స్ ...!

Update: 2018-01-20 02:07 GMT

నేరస్థులను పట్టుకునే ఉద్యోగాలకు పరీక్షలు రాసిన వారే దొంగల అవతారం ఎత్తారు. 2010 లో అవిభక్త ఏపీలో నిర్వహించిన కానిస్టేబుల్ ఉద్యోగాల్లో జరిగిన అవకతవకలు సిఐడి దర్యాప్తులో తాజాగా బట్టబయలు అయ్యాయి. కొందరు కానిస్టేబుల్ ఉద్యోగాలకు నిర్వహించిన రాతపరీక్షల్లో అంతా గోల్ మాల్ అని తేలడంతో పోలీస్ శాఖే అవాక్కయింది. దాంతో ఇలా తప్పుడు రూట్ లో వెళ్ళి దర్జాగా ఉద్యోగాలు వెలగబెడుతున్న 97 మంది కానిస్టేబుల్స్ కి శ్రీకృష్ణ జన్మస్థానం ఖాయం అయ్యింది. ఇప్పటికే నల్గొండ పోలీస్ స్టేషన్ లో 16 మంది కానిస్టేబుల్స్ ను సిఐడి అరెస్ట్ చేసి పారేసింది.

అనురాగ్ శర్మ కృషితో ...

అర్హత కలిగి తమకెందుకు ఉద్యోగాలు రాలేదో అర్ధం కానీ కొందరు నిరుద్యోగులు ఎబిసిడిలు రాకుండా ఉద్యోగాలు సాధించిన కొందరిపై అనుమానంతో ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. దీనిపై నల్గొండ ఎస్పీ హోదాలో అనురాగ్ శర్మ ప్రాధమిక దర్యాప్తు జరిపి కధ చాలావుందని సిఐడి కి సిఫార్స్ చేశారు. వారు తీగ లాగుతూ వస్తే డొంక కదిలింది. అసమర్ధులైన కొందరు అభ్యర్థులు వారి స్థానాల్లో వేరే వారిచేత రాత పరీక్ష రాయించినట్లు తేలింది. అలా లెక్క తేలిన కొందరికి తిరిగి రాత పరీక్ష నిర్వహిస్తే వారి అపూర్వ ప్రతిభ తెలిసిపోయింది. ఆ పరీక్షా పత్రాలు ఫోరెన్సిక్ ల్యాబ్ కి పంపి నిజాలు నిర్ధారించింది సిఐడి. అంతే దర్జాగా వివిధ ప్రాంతాల్లో ఉద్యోగాలు వెలగబెడుతున్న దొంగ కానిస్టేబుల్స్ కు బేడీలు వేసే పనిలో బిజీ అయ్యింది.

Similar News