ఓటుకునోటు కేసులో ఎంట్రీ ఇచ్చిన ఉండవిల్లి!

Update: 2016-11-17 23:46 GMT

తెలంగాణలో ఏసీబీ విచారణ సాగుతున్న ఓటుకు నోటు వ్యవహారం , వివాదం, దానికి సంబంధించిన కేసుల విచారణ నుంచి ఏపీ సీఎం చంద్రబాబునాయుడు కు అప్పుడే విముక్తి లభించేలా కనిపించడం లేదు. బిడ్డ చచ్చినా పురిటి వాసన పోలేదన్న సామెత చందంగా.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎడ్మినిస్ట్రేషన్ ను మొత్తం హైదరాబాదునుంచి తీసుకువెళ్లిపోయినప్పటికీ, దాన్ని ఆయన భరిస్తూనే ఉన్నారు. చంద్రబాబునాయుడు పాత్ర గురించి తేల్చాలంటూ వైకాపా ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి వేసిన పిటిషన్ విచారణలో, తన వాదనలు కూడా వినాల్సిందిగా మాజీ ఎంపీ, ప్రస్తుతం రాజకీయంగా ఎలాంటి పార్టీ ముద్ర లేకుండా ఉన్న ఉండవిల్లి అరుణ్ కుమార్ హైకోర్టును ఆశ్రయించారు.

ఓటుకు నోటు కేసుకు సంబంధించి చంద్రబాబునాయుడు తను బయటపడడానికి రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టేశారనే ఆరోపణలను ప్రత్యర్థులు వినిపిస్తున్నారు. అయితే ఒక ప్రెవేటు వ్యక్తిగా ఈ కేసు విచారణ వేగంగా సాగాలని, చంద్రబాబునాయుడు పాత్రను తేల్చాలని అసలు హైకోర్టును ఆశ్రయించే హక్కే వైకాపా ఎమ్మెల్యేకు లేదని, కేసు నిలిచేది కాదని చంద్రబాబునాయుడు తరఫున సుప్రీం కోర్టు న్యాయవాది సిద్ధార్థ లూత్రా వాదిస్తున్నారు.

ఇలాంటి నేపథ్యంలో సీనియర్ న్యాయవాది కూడా అయిన ఉండవిల్లి అరుణ్ కుమార్ హైకోర్టు విచారణలోకి తానూ ప్రవేశించారు. ఈ కేసు విస్తృత ప్రజాప్రయోజనాలతో ముడిపడి ఉన్నందున, బాధ్యతగల పౌరుడిగా వాస్తవాలను కోర్టు ముందుంచడానికి తనకు కూడా అవకాశం కల్పించాలని , తనను కూడా కేసులో కలపాలని ఆయన కోర్టుకు అనుబంధ పిటిషన్ వేసుకున్నారు. హైకోర్టు ఉండవిల్లి అరుణ్ కుమార్ వాదనలు కూడా వినడంతో, తెలంగాణ ఏసీబీ తమ చార్జిషీటులో పలుమార్లు చంద్రబాబునాయుడు పేరును పేర్కొన్నప్పటికీ.. ఇప్పటికి ఒక్కసారి కూడా ఆయనను విచారించలేదనే పాయింటును ఉండవిల్లి లేవెనెత్తారు.

కేసు విచారణ వచ్చే గురువారానికి వాయిదా పడింది గానీ.. ఈ కేసులో అమీతుమీ తేల్చడానికా అన్నట్లు ఉండవిల్లి రంగ ప్రవేశం చేయడంతో చంద్రబాబునాయుడుకు చికాకులు తప్పకపోవచ్చునని పలువురు అనుకుంటున్నారు.

Similar News