ఒడిషా అభ్యంతరాలకు కేంద్రం సమాధానం

Update: 2017-07-29 02:08 GMT

పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కోసం 2016 అక్టోబర్‌ 21 నాటికి 86,461.26 ఎకరాల భూమిని సేకరించినట్లు కేంద్ర జలవనరుల శాఖ పార్లమెంటులో ప్రకటించింది. పోలవరం కోసం జరుగుతున్న భూసేకరణపై ఒడిషా నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో భూసేకరణ వివరాలను ప్రకటించారు. ఇప్పటి వరకు సేకరించిన భూమిలో 64.42 శాతం భూమి గిరిజనులకు చెందిన భూమేనని కేంద్రం ప్రకటించింది. 2013 భూసేకరణ చట్టం ప్రకారం బాధితులకు అవసరమైన రంగాల్లో తగిన శిక్షణ ఇవ్వడంతో పాటు ప్రాజెక్టు ద్వారా ఉద్యోగాలు కల్పిస్తామని ప్రకటించింది. నిర్వాసితుల కుటుంబాల్లో కనీసం ఒక్కరికి ఉద్యోగం కల్పిస్తామని హామి ఇచ్చారు. నిర్వాసిత కుటుంబాలకు ఏకమొత్తంలో రూ.5లక్షలు చెల్లిస్తున్నట్లు వెల్లడించారు. అలాగే 20ఏళ్ల పాటు నెలకు రూ.2వేలకు తగ్గకుండా ప్రయోజనాలు అందించనున్నారు. వ్యవసాయ కార్మికులకు వినియోగ వస్తువుల ధరల సూచికి అనుగుణంగా వేతనాలు చెల్లించనున్నట్లు తెలిపారు.

Similar News