ఏపీలో ‘‘స్లమ్ డాగ్ మిలియనీర్స్’’

Update: 2016-12-15 05:10 GMT

ఏపీలోని ప్రధాన నగరాల్లో స్లమ్ అనే మాట వినపడని వాతావరణం తయారు చేయడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. స్లమ్ అనేది లేకుండా.. మెగా భవనాల నిర్మాణానికి సర్కారు కసరత్తు చేస్తోంది.

రాష్ట్రంలోని పట్టణాలను, నగరాలను మురికివాడల రహితంగా అభివృద్ధి చేసేందుకు చర్యలు వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులకు నిర్దేశించారు. బుధవారం సచివాలయంలోని తన కార్యాలయంలో విజయవాడ, గుంటూరు, తిరుపతిలోని వివిధ మురికివాడల్లో చేపట్టదలచిన బహుళ అంతస్తుల గృహనిర్మాణాలపై ముఖ్యమంత్రి సమీక్షించారు. తిరుపతిలోని స్కావెంజర్స్ కాలనీ, విజయవాడలోని దాల్ మిల్ ప్రాంతం, గుంటూరులోని కోబాల్డ్ పేట-వడ్డెగూడెంలో ముందుగా సామూహిక గృహ నిర్మాణ పథకాన్ని చేపట్టడానికి ముఖ్యమంత్రి ఆమోదం తెలిపారు. ఇందుకు సంబంధించి పలు ప్రతిపాదనలను పరిశీలించారు.

2.34 ఎకరాల్లో విస్తరించి వున్న తిరుపతిలోని స్కావెంజర్స్ కాలనీలో 286 కుటుంబాలు నివాసం వుంటున్నాయని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. వీరందరికీ 75 సెంట్లలో 11 అంతస్తుల భవనాన్ని నిర్మించేందుకు అంగీకారం తెలిపిన ముఖ్యమంత్రి ఒక్కో కుటుంబానికి కనీసం 340 చ.అ. విస్తీర్ణం తగ్గకుండా నివాస ప్రాంతం కేటాయించాలని సూచించారు. మొత్తం ఈ ప్రాజెక్టుకు అయ్యే రూ. 29.49 కోట్ల ఖర్చును భరించి నిర్మాణానికి ముందుకొచ్చే డెవెలపర్‌కు రూ.38.48 కోట్ల విలువైన 1.59 ఎకరాలను కేటాయించాలని సమావేశంలో నిర్ణయించారు. స్కావెంజర్స్ కాలనీలో నివాసం వుంటున్నవారికి మొత్తం 1,11,300 చ.అ. నివాస సముదాయాన్ని నిర్మించడంతో పాటు, 8,730 చ.అ. విస్తీర్ణంలో పాఠశాలను డెవలపర్ నిర్మించాల్సి వుంటుంది. త్వరలోనే ఈ ప్రాజెక్టుకు అధికారులు టెండర్లు పిలవనున్నారు.

విజయవాడలోని 1.11 ఎకరాల్లో వున్న దాల్ మిల్ ఏరియా మురికివాడలో నివసించే 304 పేద కుటుంబాలకు కూడా బహుళ అంతస్తుల భవనాలు నిర్మించాలని ముఖ్యమంత్రి అధికారులకు చెప్పారు. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి డెవలపర్లు ముందుకొచ్చేలా మరింత మెరుగ్గా ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు.

గుంటూరులో 20.90 ఎకరాల్లో వున్న కోబాల్డ్ పేట, 2.40 ఎకరాల్లో వున్న వడ్డెగూడెం మురికివాడల అభివృద్ధికి, గృహనిర్మాణాలకు ముఖ్యమంత్రి అంగీకారం తెలిపారు. 2,594 మంది నివసిస్తున్న కోబాల్డ్ పేట కాలనీలో మొత్తం 700 ఫ్లాట్లను, 600 మంది నివసిస్తున్న వడ్డెగూడెంలో 150 వరకు గృహ నిర్మాణాలను చేపట్టాల్సివుందని అధికారులు ముఖ్యమంత్రికి చెప్పారు.

Similar News