ఎర్రబస్సులకు ఎర్త్ పెడుతున్నదెవరు?

Update: 2017-01-28 05:22 GMT

తెలంగాణలోని ఆర్టీసీ నష్టాల కష్టాలు రావడానికి ప్రధాన కారణం హైదరాబాద్ నగరమే. ఇక్కడ బస్సులు ఎక్కువ. ఆదాయం తక్కువ. ఇక వీటికి పోటీగా ప్రయివేటు వాహనాలు జోరు కూడా ఉంది. దీంతో గ్రేటర్ హైదరాబాద్ లో బస్సులు నడపలేక ఆర్టీసీ తీవ్ర నష్టాలను చవిచూడాల్సి వస్తోంది. ఈ కారణాన్ని అధికారులు ఎప్పడో గుర్తించినా సమస్యకు పరిష్కారం లభించలేదు. ముఖ్యంగా బస్సులు సరైన సమయాలను పాటించడం లేదన్నది ప్రయాణికుల వాదన. కాని ట్రాఫిక్ లో సమయానికి చేరుకోలేక పోతున్నామంటున్నారు ఆర్టీసీ ఉద్యోగులు.

మెట్రో వస్తే.....

జంట నగరాల్లో ఆర్టీసీ మొత్తం 3,800 బస్సులను నిత్యం తిప్పుతుంది. ఏసీ, నాన్ ఏసీ బస్సులు ఎప్పుడు చూసినా రోడ్ల మీదే కన్పిస్తాయి. కాని ప్రయాణికులు మాత్రం ప్రయివేటు వాహనాలనే ఎక్కువగా ఆశ్రయిస్తున్నారు. సర్వీస్ ఆటోలు ఆర్టీసీ ఆదాయానికి భారీగా గండికొడ్తున్నాయి. ఇక క్యాబ్ ల సంగతి చెప్పనక్కరలేదు. క్యాబ్ లు పెరిగిన తర్వాత ఏసీ బస్సులకు ఎక్కువ నష్టం వస్తుందంటున్నారు. ఆర్టీసికి ఒక్క జంటనగరాల్లోనే రోజుకు కోటి రూపాయల నష్టం వస్తుందట. గత ఏడాది 350 కోట్ల రూపాయలను ఆర్టీసీ గ్రేటర్ లో నష్టాన్ని చవి చూడాల్సి వచ్చింది. ఈ ఏడాది కూడా అంతే నష్టం తప్పదంటున్నారు ఆర్టీసీ ఉన్నతాధికారులు. ఇక మోడీ పెద్ద నోట్ల రద్దుకు పదిహేను లక్షల రూపాయలను నష్టపోవాల్సి వచ్చిందట ఆర్టీసీ. జంట నగరాల్లో మొత్తం 970 బస్సు రూట్లు ఉండగా అన్ని రూట్లలోనూ ఆర్టీసీ బస్సులను నడుపుతోంది. ప్రస్తుతం రోజుకు 25 లక్షల మంది ప్రయాణికులను మాత్రమే ఆర్టీసీ బస్సులు చేరవేస్తున్నాయి. మిగిలిన వారు ప్రయివేటు వాహనాలను, సొంత వాహనాల్లో గమ్యస్థానాలకు వెళుతున్నారు. ఈ సమస్యపై అధ్యయనం చేయాలని ఆర్టీసీ నిర్ణయించింది. బస్సులను సమయానికి తిప్పడంతో పాటుగా బస్సుల్లో శుభ్రతను పాటించడం...స్టాప్ లు ఎక్కువ చేయాలని నిర్ణయించారు. ఇప్పడే ఇలా ఉంటే ఇక మెట్రో రైలు వస్తే తమ పరిస్థితి ఎలా ఉంటుందోనన్న బెంగా తెలంగాణ ఆర్టీసీ అధికారులకు పట్టుకుంది.

Similar News