ఊరంతా ఓ దారి.. ఉలిపికట్టెది మరోదారి

Update: 2016-11-18 16:20 GMT

ఈ సామెత మన పల్లెపట్టుల్లో తరచుగా వినిపిస్తూ ఉంటుంది. నోట్ల రద్దు అనే హటాత్ నిర్ణయం వలన ప్రజలకు ఎదురవుతున్న ఇబ్బందులను వీలైనంత వరకు తగ్గించడానికి మోదీ సర్కారు అనేకానేక చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగానే.. దేశవ్యాప్తంగా టోల్ ట్యాక్సులను రద్దు చేస్తూ 9 వ తేదీ ఉదయం కష్టాలు ప్రారంభం కాగానే నిర్ణయం తీసుకున్నారు. ఈ పన్ను మినహాయింపును కొంత కొంతగా పొడిగించుకుంటూ వచ్చి ప్రస్తుతం 24వ తేదీ వరకు వసూలు చేయరాదని అన్నారు. దీనివల్ల చిల్లర కొరత, ప్రజలకు కొన్ని కష్టాలు తప్పుతున్నాయి.

అయితే కేంద్రం ఆదేశాలు ఈ రకంగా ఉండగా.. హైదరాబాదులోని అవుటర్ రింగ్ రోడ్డు టోల్ కాంట్రాక్టర్లు మాత్రం ముక్కు పిండి వసూలు చేస్తుండడం వాహనదారుల్ని ఇబ్బందిపెడుతోంది.

కేంద్రం నిర్ణయాలతో రాబడి పడిపోయిందని కొన్ని రోజులుగా మధనపడిపోతున్న కాంట్రాక్టర్లు.. అడ్డగోలుగా ప్రభుత్వాదేశాలను ధిక్కరించడమే విశేషం. అయితే.. అవుటర్ రింగ్ రోడ్డు విషయంలో హెచ్ఎండీఏ పాత్ర కూడా ఉంది. అసలే తెలంగాణ ప్రభుత్వానికి రావాల్సిన చాలా రాబడులు పడిపోయాయని ఆవేదన చెందుతున్న సర్కారు తరఫున హెచ్ఎండీయే మాత్రం టోల్ వసూళ్లకే మొగ్గింది. ఇది టోల్ దళారీల ఉలిపికట్టె వ్యవహారం అయితే... నగదు మార్పిడి వ్యవహారాల్లో అనేక అడ్డగోలు వ్యవహారాలు జరుగుతున్నాయి.

బ్యాంకుల్లో వినియోగదార్లకు పరిమితంగానే కొత్త నగదు ఇవ్వాల్సిన వారు.. తమకు కావాల్సిన వారికి కట్టలుగా సొమ్మును ఇచ్చేయడమూ, బ్యాంకు సిబ్బందే కమిషన్ల దందాలు మాట్లాడుకుని బ్లాక్ ను వైట్ చేయడమూ వంటి అనేక అక్రమాలు జరుగుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.

Similar News