ఇన్ఫోసిస్ ఫౌండేషన్ వారి అనుపు ఉత్సవం

Update: 2016-12-09 14:16 GMT

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అంతరించిపోతున్న కళలకు పూర్వవైభవం తీసుకువచ్చేందుకు, వాటిని ప్రోత్సహించేందుకు ఉద్దేశించిన సాంస్కృతిక వేడుక ‘అనుపు ఉత్సవం 2016’ ప్రారంభం అయింది. ఇన్ఫోసిస్ వారి స్వచ్ఛంద సంస్థ ఇన్ఫోసిస్ ఫౌండేషన్ , భారతీయ విద్యాభవన్ తో కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. అంతరిస్తున్న కళలను కాపాడడం, కళాకారుల్ని ప్రోత్సహించడం దీని లక్ష్యం.

నాగార్జున సాగర్ డ్యాం సమీపంలో కృష్ణా తీరంలో అనుపు గ్రామం ఉంటుంది. మూడో శతాబ్దంలో బౌద్దం పరిఢవిల్లిన ప్రాచీన అద్భుతం ఈ క్షేత్రం. నాగార్జున సాగర్ డ్యాం నిర్మాణ సమయంలో తవ్వకాల్లో బౌద్ధం ఆనవాళ్లు శిథిలాల రూపంలో బయటపడ్డాయి. బౌద్ధ విహారం, హారతి ఆలయం, పెద్ద ఆంఫి థియేటర్ ఉండేవని తెలుస్తోంది. ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వారు అనుపును పునర్నిర్మించడం జరిగింది. తద్వారా 80 హెక్టార్ల స్థలాన్ని ప్రపంచంలోనే ముఖ్యమైన బౌద్ధ చారిత్రక ప్రదేశంగా తీర్చిదిద్దారు.

భారతదేశంలోని ఘనమైన బౌద్ధ సంస్కృతి కి నిదర్శనంగా ఈ అనుపు ఉత్సవాన్ని ఇన్ఫోసిస్ ఫౌండేషన్ వారు నిర్వహిస్తున్నారు. అసమానమైన ఈ ఉత్సవంలో సాంప్రదాయ కళా ప్రదర్శనలు అలరించనున్నాయి. 350 మంది కళాకారులు పాల్గొనే 15 అంశాలను ఈ వేడుకలో ప్రదర్శించనున్నారు. ఈ ఉత్సవాన్ని మంత్రులు ప్రత్తిపాటి పుల్లరావు, రావెల కిశోర్ బాబు, ఇన్ఫోసిస్ ఫౌండేషన్ ఛైర్ పర్సన్ సుధామూర్తిలు ప్రారంభించారు.

భారతదేశపు సాంస్కృతిక వారసత్వానికి చారిత్రక చిహ్నాలు ప్రతీకలు అని ఫౌండేషన్ ఛైర్ పర్సన్ సుధామూర్తి అన్నారు. భారతీయ చారిత్రక వైభవాన్ని ప్రతిబింబించే గొప్ప స్థలం అనుపు అని ఆమె వ్యాఖ్యానించారు.

Similar News