ఇంకోసారి క్లారిటీ : అసెంబ్లీ సీట్ల పెంపు ఇప్పట్లో లేనట్లే!

Update: 2016-11-29 13:52 GMT

రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి ఎమ్మెల్యేలు అయిపోదాం అని అనేక మంది ఆశావహులకు ఇది చేదు వార్త. రాష్ట్ర విభజన నేపథ్యంలో ప్రత్యేక పరిస్థితుల్లో ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ అసెంబ్లీ సీట్ల సంఖ్య పెంచడానికి జరుగుతున్న ప్రయత్నాలు.. 2019 లోగా ఒక కొలిక్కి రాకపోవచ్చు. ఇప్పట్లో నియోజకవర్గాల పెంపు సాధ్యం కాదని పార్లమెంటు సాక్షిగా ప్రభుత్వం స్పష్టం చేసేసింది. ఈ పార్లమెంటు సమావేశాల్లోనే ఈ విషయాన్ని కేంద్రమంత్రులు సభాముఖంగా స్పష్టం చేయడం ఇది రెండోసారి. కొన్ని రోజుల కిందట ఏపీ సభ్యులు అడిగిన ప్రశ్నకు సమాధానంగా నియోజకవర్గాల పెంపు ఇప్ప్టట్లో జరగదని హోం శాఖ సహాయ మంత్రి వెల్లడించిన సంగతి పాఠకులకు గుర్తుంటుంది.

ఇదే అంశాన్ని మంగళవారం నాడు తెలంగాణ రాష్ట్ర సమితికి చెందిన సభ్యులు కూడా సభలో ప్రస్తావించారు. దీనికి హోం శాఖ సహాయ మంత్రి మరోసారి లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు. శాసనసభ స్థానాల పెంచాలంటే ఆర్టికల్‌ 170 (3)ను సవరించాలని, ఆ ప్రక్రియ 2026వరకు సాధ్యం కాదని ఈ సమాధానంలో పేర్కొన్నారు. అసెంబ్లి స్థానాల పెంపుపై ఆంధ్ర, తెలంగాణ నుంచి అభ్యర్థనలు వచ్చాయని, ఆర్టికల్‌ 170 సెక్షన్‌ 26ను సవరిస్తే పెంపు సాధ్యమవుతుందని ఏజీ చెప్పారని తెలియజేశారు. ఈ పార్లమెంటు ప్రకటన ద్వారా.. 2019లోగా ఎలాగో ఒకలా సీట్లు పెరుగుతాయిలే అనుకుంటున్న వారి ఆశలు గల్లంతయినట్లే.

సీట్లపెంపు హామీతోనే.. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ అధికార పార్టీలు లెక్కకు మిక్కిలిగా ఇతర పార్టీలనుంచి నాయకులను తమలో కలిపేసుకున్నాయి. సీట్లు పెరిగాక అందరికీ అవకాశం కల్పిస్తాం అంటూ కబుర్లు చెప్పాయి. మరో వైపు సీట్లు పెంచడానికి ఇద్దరు సీఎంలు చేయని ప్రయత్నం లేదు. ఈ ప్రక్రియ కోసం కేంద్రంమంత్రి వెంకయ్యనాయుడు కూడా చాలా సుదీర్ఘమైన ప్రయత్నం చేశారు. కానీ వాస్తవంలో అది కార్యరూపం దాల్చడం లేదు. ఆశావహులు ప్రత్యామ్నాయాలు చూసుకోవాల్సిందే.

Similar News