ఆంధ్రా పోలీసులు ఎవ్వరూ ఇక్కడ ఉండొద్దు

Update: 2017-01-05 17:08 GMT

ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఎవ్వరూ తెలంగాణ రాష్ట్రంలో కొనసాగడానికి వీల్లేదని హోంశాఖ మంత్రి నాయిని నర్సింహ్మారెడ్డి స్పష్టం చేశారు. ఇరు రాష్ట్రాల మధ్య ఉద్యోగుల విభజన కమల్ నాథన్ కమిటీ సిఫారసుల ఆధారంగాను ఉంటాయని ఆయన అన్నారు. గురువారం అసెంబ్లీలో టిఆర్ఎస్ ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ ఆంధ్రా పోలీసుల తరలింపుపై తక్షణమే నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. తెలంగాణ ఉద్యమంలో ఇక్కడి విద్యార్థులు, నాయకులపై విచక్షణారహితంగా దాడులు చేసిన పోలీసులు ఇక్కడ విధులు నిర్వహించడం ఏమాత్రం సముచితం కాదని ఆయన అన్నారు. ఇప్పటి వరకు ఎంత మంది పోలీసులను ఆంధ్రకు పంపించారని హోంమంత్రిని అడిగారు.

శ్రీనివాస్ గౌడ్ ప్రశ్నలకు స్పందించిన నాయిని నర్సింహ్మారెడ్డి...హైదరాబాద్ తెలుగు రాష్ట్రాలకు ప్రస్తుతం ఉమ్మడి రాజధానిగా ఉండటం వల్ల...ఏపీ నేతలు, అధికారులకు భద్రత కల్పించేందుకు మాత్రమే ఏపీ పోలీసులు ఇక్కడ కొనసాగుతున్నారని అన్నారు. తెలంగాణ పోలీసులు పరిమిత సంఖ్యలో ఉండటం వల్ల హైదరాబాద్ లో ఉన్న ఏపీ నేతలకు రక్షణ కల్పించడం తమ వల్ల కాదని ఆయన స్పష్టం చేశారు.

అయితే కమల్ నాథన్ కమిటీ సిఫారసుల ఆధారంగా ఆంధ్ర ప్రాంతానికి చెందిన ఏ ఒక్క పోలీసు తెలంగాణలో ఉండటానికి వీల్లేదని, అందరినీ త్వరలోనే వారి సొంత రాష్ట్రానికి పంపిస్తామని నాయిని వెల్లడించారు.త్వరలో మరో 8వేలకుపైగా ఎస్సై , కానిస్టేబుల్ పోస్టుల భర్తీ చేపడ్తామని ఆయన తెలిపారు.

Similar News