ఆ అధికారులపై చంద్రబాబు సీరియస్

Update: 2018-03-31 03:36 GMT

ఒంటిమిట్ట ఘటనపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సీరియస్ అయ్యారు. నిన్న రాత్రి ఒంటిమిట్ట సీతారామ కల్యాణం సందర్భంగా గాలివాన బీభత్సంతో నలుగురు మృతి చెందారు. 54 మంది గాయపడ్డారు. గాయపడిన వారిని కడప రిమ్స్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. అయితే ఒంటిమిట్ట రామాలయంలో కల్యాణానికి తిరుమల తిరుపతి దేవస్థానం ఏర్పాట్లు చేసింది. గత వారం రోజుల నుంచి ఏర్పాట్లు చేసినా గాలివాన దెబ్బకు టెంట్లన్నీ కూలిపోయాయి. టెంట్లు కూలిపోవడంతో అక్కడికక్కడే నలుగురు భక్తులు దుర్మరణం పాలయ్యారు. సీతారాముల కల్యాణోత్సవంలో పాల్గొనేందుకు వచ్చిన చంద్రబాబు దంపతులు స్వామి వారికి పట్టు వస్త్రాలను సమర్పించారు. అయితే ఈ ఘటనలో పోలీసుల వైఫల్యం కొట్టొచ్చినట్లు కన్పిస్తుందంటున్నారు. గాలివాన బీభత్సం ఉన్నప్పటికీ షెడ్డుల నుంచి భక్తులను బయటకు రాకుండా పోలీసులు అడ్డుకోవడంతోనే తొక్కిసలాట జరిగిందని ఉన్నతాధికారుల సమీక్షలో తేలింది. దీనిపై చంద్రబాబు కొద్దిసేపటి క్రితం సమీక్ష చేశారు. అధికారుల తీరుపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులను ఆదేశించారు.

Similar News