అమ్మ వారసత్వంపై గొడవేమీ లేదంట

Update: 2016-12-10 10:39 GMT

తమిళనాట రాజకీయాలు అట్టుడికిపోతున్నాయి. ఒకవైపు శశికళ- జయలలిత స్థాయిలో అన్నీ తానే అయి సర్వాంతర్యామిలాగా చక్రం తిప్పేయాలని ముచ్చటపడుతుండగా.. మరోవైపు పన్నీర్ సెల్వం తాను ఇప్పటికీ జయ నీడలో బతుకుతున్న వాడిని కాదని, స్వతంత్రంగా వ్యవహరించగల ముఖ్యమంత్రిని అని సంకేతాలు ఇస్తున్నారు. జయలలిత కొన్ని సంవత్సరాలు పాటు ఎలాంటి అనుమతులు ఇవ్వకుండా అర్థంతరంగా పనులు ఆపించి వేసిన మధురకోవిల్ ఫ్లై ఓవర్ కు తిరిగి పనులు ప్రారంభించేలా పన్నీర్ సెల్వం అనుమతి ఇవ్వడం చాలా తీవ్రమైన విషయం. శశికళ పార్టీ ప్రధాన కార్యదర్శి పదవిని తాను దక్కించుకోవడానికి, పార్టీలోని శక్తులను సమీకరిస్తున్నట్లుగా కొన్ని వదంతులు వస్తున్నాయి.

ఇన్ని రకాల పుకార్ల నేపథ్యంలో... పార్టీ అధికార ప్రతినిధి సి. పొన్నెయ్యన్ తమ పార్టీలో ప్రధాన కార్యదర్శి పదవిని అందిపుచ్చుకునే వారసత్వం విషయంలో ఎలాంటి ప్రతిష్టంభన, వివాదం లేదని మీడియాకు సెలవిచ్చారు. ఏదో జరుగుతోందని కొన్ని వార్తలు వస్తున్నాయని, తాము సర్వసభ్య సమావేశం పెట్టుకుని ప్రధాన కార్యదర్శిని ఎన్నుకుంటాం అని పొన్నెయ్యన్ చెప్పడం విశేషం. ఎంజీఆర్ జయలలితల ఆత్మను స్ఫూర్తిని కొనసాగించగలవారికే నాయకత్వం దక్కుతుందని ఆయన చెప్పారు. పార్టీలో ఎలాంటి శూన్యత లేదని ఆయన అంటున్నారు.

మంత్రులంతా పోయెస్ గార్డెన్ కు వెళ్లి శశికళతో భేటీ కావడం గురించి అడిగితే దివంగత నాయకురాలికి నివాళి అర్పించడానికి వెళ్లి ఉండవచ్చునంటూ సమర్థించుకున్నారు.

మొత్తానికి తమిళనాట అన్నాడీఎంకే రాజకీయాలు రసకందాయంలో పడుతున్నాయి.

Similar News