అమెరికాలో ఉన్న వివాహితను వేధిస్తున్న యువకుడు

Update: 2017-02-05 04:14 GMT

మెయిల్స్.. ఎస్‌ఎంఎస్‌లు.. వాట్సప్‌ల ద్వారా అసభ్య సందేశాలు పంపుతూ అమెరికాలో ఉన్న ఓ వివాహితను వేధిస్తున్న యువకుడిపై పెనమలూరు పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదైంది. బాధితురాలు అమెరికా నుంచి విజయవాడ సీపీ గౌతమ్‌సవాంగ్‌కు మెయిల్‌ ద్వారా ఫిర్యాదు చేయడంతో వెంటనే స్పందించిన ఆయన ఆ యువకుడిపై కేసు నమోదు చేయించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కానూరు అశోక్‌నగర్‌లో 5 ఏళ్ల క్రితం ఆమె నివసించేది. అక్కినేని విజయకృష్ణ అనే యువకుడు ఈమె పక్కింట్లో ఉండేవాడు. వీరిద్దరికీ పరిచయం ఉండగా కొన్నాళ్ల తర్వాత ఆ యువతికి వివాహం కావడంతో భర్తతో కలిసి అమెరికా వెళ్లిపోయింది. దాదాపు ఏడాదిన్నరేళ్లుగా విజయకృష్ణ.. అమెరికాలో ఉంటున్న ఆమెను పలు రకాలుగా వేధింపులకు గురిచేస్తున్నాడు. ఎస్‌ఎంఎస్‌లు, మెయిళ్లు, వాట్సప్‌ల ద్వారా ఆమెకు అసభ్య సందేశాలు పంపడం, బెదిరించడం చేస్తుండగా ఇటీవల వేధింపులు పరాకాష్ఠకు చేరుకొన్నాయి.వీటిని భరించలేని ఆమె అమెరికా నుంచే విజయవాడ సీపీ గౌతమ్‌సవాంగ్‌కు మెయిల్‌ ద్వారా తనకు ఎదురవుతున్న వేధింపులు, బెదిరింపులపై ఫిర్యాదు చేసింది. విజయకృష్ణ బారి నుంచి తనను కాపాడాలంటూ అభ్యర్థించడంతో సీపీ వెంటనే స్పందించి పెనమలూరు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనపై వెంటనే చర్యలు తీసుకోవాలంటూ ఆదేశించడంతో సీఐ దామోదర్‌ విజయకృష్ణపై శనివారం కేసు నమోదు చేశారు. నిందితుడు పరారీ లో ఉన్నాడు., ఐటీ యాక్ట్ తో పాటు నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేశారు.

Similar News