అధికార విపక్షాలను ఏకిపారేసిన ఉండవిల్లి

Update: 2016-10-17 06:58 GMT

మాజీ ఎంపీ, సమైక్యాంద్ర ఉద్యమాన్ని ఒక స్థాయిలో ప్రజల్లోకి తీసుకువెళ్లడానికి అప్పట్లో విఫలయత్న చేసిన నేత ఉండవిల్లి అరుణ్‌కుమార్ ప్రస్తుతం రాజకీయ పార్టీలతో నిమిత్తం లేకుండా స్వతంత్రంగానే ఉన్నారు. కొన్నాళ్లుగా ఆయన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరవచ్చుననే ప్రచారం జరుగుతూనే ఉన్నది గానీ.. ఎవరూ దానిని ధ్రువీకరించలేదు.

అలాంటి నేపథ్యంలో మేధావిగా పేరున్న ఉండవిల్లి అరుణ్ కుమార్ సోమవారం నాడు హైదరాబాదు లో ప్రెస్ మీట్ పెట్టి.. విభజన చట్టం- అనంతర పరిణామాల విషయంలో వాస్తవాలు మాట్లాడకుండా ఏపీ ప్రభుత్వం ప్రజలను మోసం చేయడానికి చూస్తున్నదంటూ విమర్శలు గుప్పించారు. రాష్ర్టానికి ప్రత్యేకహోదా కావాలంటూ ఎవరు అడిగినా సరే.. వారి మీద దేశద్రోహి ముద్రవేయడానికి తెలుగుదేశం నాయకులు ఉత్సాహపడుతున్నారంటూ ఉండవిల్లి ఆరోపించారు. విభజన చట్టం లోని ఏయే అంశాలు ఇప్పటికి అమలయ్యాయో.. ఆ చట్టం ద్వారా ఏపీకి రావాల్సినవి ఇప్పటివరకూ ఏం వచ్చాయో స్పష్టత లేకుండా పోతున్నదని ఉండవిల్లి చెప్పుకొచ్చారు.

విభజన చట్టంలో పేర్కొన్న నిధులను డిమాండ్ చేసి తీసుకోవాల్సిందిపోయి వాటి విషయంలో ఉపేక్ష వహిస్తున్నారని చెప్పారు. హోదా అనేది మంటగలిపేశారు. చట్టంలో పేర్కొన్న రైల్వేజోన్ అనేది రానే రాదని కేంద్ర మంత్రులే తెగేసి చెప్పేశారు. దాన్ని గురించి ప్రశ్నించే దిక్కు లేకుండా పోయింది. రెవిన్యూ లోటు ఒక్కటీ ఇవ్వడానికి ఒప్పుకుంటే రెండున్నరేళ్లు గడచిపోయిన తర్వాత కూడా తొలి ఏడాది లోటు ఇంకా 8వేల కోట్లు పెండింగ్ లో ఉంటే దాన్ని రాబట్టడం గురించి మాట్లాడడం లేదని, పోలవరం కూడా సత్వర నిదులు రాబట్టేలా ప్రయత్నాలు సాగడం లేదని ఉండవిల్లి ఆరోపించారు.

అదే సమయంలో రాష్ట్రంలో ప్రతిపక్షం కూడా అచేతనంగా ఉన్నదని ఆయన చెప్పారు. అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీయడంలో ప్రతిపక్షం విఫలం అయిందని ఆయన చెప్పారు. అయితే.. జగన్ హోదా గురించి మాట్లాడిన ప్రతిసారీ లక్షకోట్ల అవినీతి చేశాడంటూ తెలుగుదేశం నాయకులు వాదించే విషయంలో ఆయన జగన్ కు మద్దతిచ్చారు. జగన్ మీద 13 వేల కోట్ల రూపాయల అవినీతి నేరారోపణలకు సంబంధించి మాత్రమే అభియోగాలు ఉన్నాయని అడ్డగోలు విమర్శలు చేస్తూ హోదా గురించి మాట్లాడినప్పుడెల్లా.. ఆయనను కట్టడి చేసే ప్రయత్నాలను ఉండవిల్లి తప్పుపట్టారు.

తాను ప్రస్తుతం రాజకీయాలనుంచి పూర్తిగా తప్పుకున్నానని, తన వయసు ఆరోగ్యం ఎన్నికల రాజకీయాలకు సహకరించడం లేదని ఉండవల్లి అరుణ్ కుమార్ పేర్కొనడం విశేషం.

Similar News