కాంగ్రెస్ - చంద్రబాబు, బీజేపీలపై జగన్ ఫైర్..!

Update: 2018-11-28 12:08 GMT

ఓ వైపు రాష్ట్రంలో రైతులు కరువుతో అల్లాడుతూ గ్రామాలను విడిచి వలసలు పోతుంటే 20 కోట్లతో బోటు రేసు, 10 కోట్లతో ఎయిర్ షోలు పెడుతూ చంద్రబాబు కూలింగ్ గ్లాసులు పెట్టుకుని చూస్తున్నారని ప్రతిపక్ష నేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. బుధవారం శ్రీకాకుళం జిల్లా పాలకొండలో జరిగిన బహిరంగ సభలో జగన్ మాట్లాడుతూ... చంద్రబాబుకు ఎన్నికలకు మూడు నెలలు ఉన్నప్పుడు ఉత్తరాంధ్ర సుజల స్రవంతి, గోదావరి - పెన్నా అనుసంధానం అంటూ కొబ్బరికాయలు కొడుతున్నారని ఆరోపించారు. కులాలవారీగా ప్రజలను ఎలా మోసం చేయాలో చంద్రబాబు పీహెచ్ డీ చేశారని ఎద్దేవా చేశారు. సుజనా చౌదరి, సీఎం రమేష్, రాయపాటి, లింగమనేని, నారా లోకేష్, దేవినేని, పత్తిపాటి, యరపతినేని, కొమ్మలపాటి, నారాయణ, యెల్లో మీడియా పెద్దలకు వేల కోట్ల లబ్ధి చేసి చంద్రబాబు సామాజిక న్యాయం చేశారని ఎద్దేవా చేశారు. తిత్లీ తుఫాను బాధితులను ఆదుకున్నట్లుగా ఫ్లెక్సీలు వేసుకుంటూ తప్పుడు ప్రచారం చేస్తున్న చంద్రబాబు వ్యవహారం శవాల మీద చిల్లర ఏరుకున్నట్లుగా ఉందన్నారు.

ఇక నమ్మడం చాలు... మోసపోవద్దు...

ఓ వైపు రాష్ట్రంలో కరువుతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతుండటం, చంద్రబాబు మాత్రం ప్రజల దృష్టిని మళ్లించడానికి విమానాలు ఎక్కి రాష్ట్రాలు తిరుగుతున్నారని జగన్ పేర్కొన్నారు. వారంతా ఎప్పటినుంచో బీజేపీకి వ్యతిరకంగా ఉన్నవారే అని, కానీ చంద్రబాబు తన సుందర ముఖారవిందాన్ని చూసి వాళ్లు ఇప్పుడు బీజేపీకి వ్యతిరేకులైనట్లు బిల్డప్ ఇస్తున్నారని ఎద్దేవా చేశారు. 2014లో ఇదే చంద్రబాబు బీజేపీ బొమ్మ పెట్టుకోగా, ఇవాళ కాంగ్రెస్ బొమ్మ పెట్టుకుని అవే డైలాగులు చెబుతున్నారని పేర్కొన్నారు. గత ఎన్నికలప్పుడు చంద్రబాబు సమక్షంలో మోదీ పదేళ్లు ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పారని... ఇవాళ యాక్టర్లు మారి బీజేపీ పోయి కాంగ్రెస్ వచ్చి అవే మాటలు చెబుతుందన్నారు. రాష్ట్రాన్ని విడగొట్టే సమయంలో ప్రత్యేక హోదా హామీని కాంగ్రెస్ విభజన చట్టంలో పెట్టి ఉంటే మనం కోర్టుకు వెళ్లయినా సాధించేవాళ్లం కదా అని ప్రశ్నించారు. అప్పుడు రాష్ట్రానికి ఇచ్చిన అన్ని హామీలను పరిశీలిస్తామని విభజన చట్టంలో పెట్టి మోసం చేశారని, ఒక్క హామీని కూడా కచ్చితంగా చేస్తామని పెట్టలేదన్నారు. నాలుగేళ్లు బీజేపీతో కాపురం చేసినప్పుడు చంద్రబాబుకు ప్రత్యేక హోదా గుర్తుకు రాలేదని, ఇప్పుడు విడాకులు తీసుకున్నాక ప్రత్యేక హోదా అంటున్నారన్నారు. ఇక నమ్మడం ఇక చాలు అని.. కాంగ్రెస్ ని, బీజేపీని, చంద్రబాబును, ఆయన పార్ట్ నర్ పవన్ కళ్యాణ్ ను నమ్మవద్దని కోరారు. వీరంతా గతంలో మనల్ని మోసం చేసినవారేనని, వీరంతా కలిసి రాష్ట్రాన్ని హత్య చేశారని ఆరోపంచారు. ఒకరు కత్తి ఇస్తే, ఇంకొకరు చేతులు పట్టుకోగా మరోకరు రాష్ట్రాన్ని పొడిచారన్నారు. ఈ పార్టీలను నమ్మకుండా 25కి 25 ఎంపీ స్థానాలు మనమే గెలుచుకుని ఎవరు ప్రత్యేక హోదా ఇస్తూ సంతకం చేస్తారో వారికే మద్దతు ఇద్దామన్నారు. కానీ, ముందే వారిని నమ్మి మోసపోవద్దని కోరారు.

Similar News