చంద్రబాబు ఇక వీరి విషయం తేల్చాల్సిందేనా?

Update: 2018-05-30 09:30 GMT

మహానాడు ముగిసి గంటకూడా కాలేదు. చంద్రబాబు మహానాడు మూడు రోజులూ నేతలు ఎలా ఉండాలో క్లాస్ పీకినా వీరికి బోధ పడలేదు. విశాఖపట్నం జిల్లాలో మంత్రుల మధ్య విభేదాలు మళ్లీ భగ్గుమన్నాయి. జిల్లా పశు సంవర్ధక శాఖకు సంబంధించిన నియమకాలపై జిల్లా మంత్రులు అయ్యన్నపాత్రుడు, గంటా శ్రీనివాసరావు మధ్య వివాదం వచ్చింది. దీంతో ఇరువురి వర్గాలకు చెందిన వారు పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నారు. అయితే, తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పాటైన నాటి నుంచి కూడా ఇద్దరు మంత్రుల మధ్య విభేదాలు తారస్థాయిలో ఉన్నాయి. వీరి మధ్య రాజీ కుదిర్చేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా జోక్యం చేసుకున్నా ఎటువంటి లాభం లేకుండా పోయింది. నిన్న మహానాడు వేదికగా తెలుగుదేశం పార్టీ నాయకులు అంతర్గత విభేదాలు పక్కనపెట్టాలని చంద్రబాబు నాయుడు వార్నింగ్ ఇచ్చినా ఇవాళ వివాదం నెలకొనడం చర్చనీయాంశమైంది.

అసలేం జరిగింది...

విశాఖపట్నం జిల్లాకు చెందిన పశు సంవర్ధక శాఖ జేడీ, ఛైర్మన్ నియామకం పట్ల ఇద్దరు మంత్రులు ఆధిపత్యం చూపేందుకు ప్రయత్నిస్తున్నారు. ఎటువంటి ఆరోపణలు లేని పాత వారినే కొనసాగించాలని అయ్యన్నపాత్రుడు పట్టుపడుతున్నారు. అయితే, గంటా శ్రీనివాసరావు మాత్రం మూడు పర్యాయాలుగా కాంగ్రెస్ కి చెందిన వ్యక్తుల చేతిలో కమిటీ ఉందని, వీరిని మార్చాలని పట్టుబడుతున్నారు. ఈ మేరకు ఇటీవల కొత్త వారిని నియమించారు. అయితే, గంటా సన్నిహితులను నియమించారనేది అయ్యన్న వాదన. దీంతో వీరిని మార్చాలని అయ్యన్న పట్టుబట్టడంతో కొత్తగా నియమించిన జేడీని ప్రభుత్వానికి సరెండర్ చేశారు. దీంతో వివాదం ముగిసిందని అందరూ అనుకున్నారు. అయితే మరోసారి రంగంలోకి దిగిన గంటా శ్రీనివాసరావు పాతవారినే మళ్లీ నియమించేలా చేశారు. దీంతో అయ్యన్న భగ్గుమన్నారు. తన మాటకు విలువ లేనప్పుడు తాను మంత్రిగా ఉండాల్సిన అవసరం లేదని స్పష్టం చేస్తున్నారు.

భూములు కాజేసేందుకే అంటున్న ...

జిల్లాలో జరుగుతన్న పరిణామాలపై అసంతృప్తితో ఉన్న మంత్రి అయ్యన్నపాత్రుడు జిల్లా ఇంఛార్జి మంత్రి కే.ఈ.కృష్ణమూర్తి వద్ద తన ఆవేదనను వెళ్లగక్కారు. పశు సంవర్ధక శాఖకు జిల్లాలో విలువైన భూములు, ఆస్తులు ఉన్నందున, వాటిని దక్కించుకునేందుకు గంటా తన సన్నిహితులను నియమించుకున్నారని అయ్యన్నపాత్రుడు వర్గం వారు ఆరోపిస్తున్నారు. అయితే, ఇప్పటికే వీరిద్దరి మధ్య విభేదాలతో జిల్లాలో పార్టీకి ఇబ్బందిగా మారింది. ముఖ్యమంత్రి స్వయంగా జోక్యం చేసుకున్నా విభేదాలు సద్దుమణగలేదు. దీంతో ఈ వివాదం ఎంతవరకు వెళుతుందోనని జిల్లా పార్టీ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

Similar News