వెంకయ్య మధుర జ్ఞాపకాలు..!

Update: 2018-08-28 13:13 GMT

నేను రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతిగా కావాలని ఆకాంక్షించలేదని, ఈ విషయాన్ని ప్రధాని మోదీకి కూడా చెప్పానని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు పేర్కొన్నారు. కానీ, దక్షిణాది ప్రాంత వ్యక్తి ఉండాలని, రాజ్యసభను హుందాగా నడిపించాలని ఎన్నికలకు ఒకరోజు ముందు చెప్పి తనను పోటీ చేయించారని ఆయన పేర్కొన్నారు. ముందే చెప్పి ఉంటే తనకు అందరూ సహకరించేవారని, ఏకగ్రీవంగా ఎన్నికయ్యే అవకాశం ఉండేదన్నారు. మంగళవారం ఆయన హైదరాబాద్ లో ఆత్మీయ సమావేశం నిర్వహించారు.

నెల్లూరు కాంతారావుతో ఫైట్......

ఈ సందర్భంగా ఆయన తన రాజకీయ జీవితంలోని అనుభవాలను గుర్తుచేసుకున్నారు. ప్రస్తుతం విమర్శలు ఎదుర్కునే శక్తి పాలకుల్లో నశించిందని, సరైన విమర్శలు చేసే శక్తి ప్రతిపక్షాల్లో నశించిందని వ్యాఖ్యానించారు. అసెంబ్లీకి ఎనిమిది గంటలకు వెళ్తే సభ అయిపోయే వరకు కుర్చీ నుంచి లేచే వాళ్లం కాదని, లైబ్రరీకి వెళ్లే అవగాహన పెంచుకునేవాళ్లమన్నారు. నెల్లూరు కాంతారావు అనే పహిల్వాన్ ఒక విద్యార్థిని కొడితే తాము నెల రోజులు సమ్మె చేసి వారిని జైల్లో పెట్టించేంత వరకూ నిద్ర పోలేదని వెంకయ్య పేర్కొన్నారు. తన రాజకీయ జీవితంలో ఎన్నో ఎత్తు పల్లాలను చూశానన్నారు. తనకు రాజకీయ ప్రచారంలో స్నేహితులే అండగా నిలిచారన్నారు. కొందరు స్కూటర్లు ఇచ్చి ప్రోత్సహిస్తే, మరికొందరు కార్లను ఇచ్చి తనకు సహకరించారన్నారు. అందుకే తాను ఎంత పెద్ద పదవిలో ఉన్నా స్నేహితులను మాత్రం మరవలేనని వెంకయ్య చెప్పారు.

Similar News