యాడ్...అభాసుపాలయిందే....!

Update: 2018-08-20 14:15 GMT

తెలంగాణ ప్రభుత్వం ఈ మధ్య ప్రచారం, ప్రకటనలకు పెడుతున్న ఖర్చులపై తీవ్ర విమర్శలు ఎదురవుతున్నాయి. ఏ ప్రభుత్వ పథకం ప్రారంభించినా ముందుగా భారీ ఎత్తున పత్రికలకు ప్రకటనలు ఇస్తున్నారు. అయితే, సదరు పథకం పట్ల ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రకటనలు ఇవ్వడం తప్పు కాదు గానీ, ప్రకటనలు ఇచ్చే ధోరణి ఇప్పుడు వివాదాస్పదమవుతోంది. తెలంగాణలో ప్రవేశపెట్టే పథకాలకు సంబంధించిన ప్రకటనలు ప్రభుత్వం జాతీయ పత్రికలతో పాటు ఇతర రాష్ట్రాలు, ఇతర భాషల పత్రికలకు కూడా ఇస్తోంది. దీంతో ప్రతిపక్షాలు ప్రభుత్వ వైఖరిపై విమర్శలు చేస్తున్నారు. ఇటువంటి సందర్భంలో ఆగస్టు 14న కంటి వెలుగు, రైతు బీమా పథకాలకు సంబంధించి తెలుగు, ఇంగ్లీష్ పత్రికలకు ఇచ్చిన ప్రకటనల్లో తప్పు దొర్లడంతో ప్రభుత్వం ఇరుకున పడింది.

ఇదే మొదటిసారి కాదు...

సూర్యాపేట జిల్లా కోదాడ ప్రాంతానికి చెందిన ఓ నిరుపేద దంపతులు, వారి బిడ్డ ఫోటో ఈ రెండు ప్రకటనల్లో వాడారు. అయితే, రైతు బీమా పథకం ప్రకటనలో ఫోటో సరిగ్గానే ఉన్నా, అసలు సదరు కుటుంబానికి వ్యవసాయ భూమే లేదు. వారిది బొంతలు కుట్టుకుంటూ జీవించే కుటుంబం. ఇక కంటి వెలుగు పథకానికి సంబంధించి ఇచ్చిన ప్రకటనలో రైతు బీమా పథకానికి ఇచ్చిన ఫోటోనే కొంత ఎడిట్ చేసి వాడేశారు. బిడ్డను ఎత్తుకుని ఉన్న మహిళను అలానే ఉంచి పక్కన భర్తను మాత్రం మార్చేశారు. దీంతో సోషల్ మీడియా వేదికగా తీవ్ర విమర్శలు వచ్చాయి. ఇదే సమయంలో సదరు కుటుంబం కూడా స్పందించింది. తమకు అన్యాయం చేశారని, పరువు పోయిందని విమర్శించారు. దీంతో ఆలస్యంగా తేరుకున్న ఐ ఆండ్ పీఆర్ శాఖ రెండు యాడ్ ఏజెన్సీలకు నోటీసులు జారీ చేసింది. తప్పు ఎలా జరిగిందో వివరణ ఇవ్వాలని ఆదేశించింది. అయితే, ఇలా తప్పుడు ప్రకటనలు ఇవ్వడం ఇదే మొదటిసారి కాదు. గతంలో వృద్ధాప్య పింఛన్లకు సంబంధించి ఇచ్చిన ప్రకటనలో కూడా ఇదే విధంగా తప్పు చేశారు. అయినా కూడా సదరు యాడ్ ఏజెన్సీలు, అధికారులు మేలుకోనట్లున్నారు. వారు చేసిన తప్పిదానికి ప్రభుత్వం కోట్లు వెచ్చించి ఇచ్చిన ప్రకటనలు ఉల్టా విమర్శలకు తావిచ్చినట్లయింది.

Similar News