ఆ నిబంధన పెడితే ఎవరూ మిగలరట

తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో కలహాలకు పుల్ స్టాప్ పడే పరిస్థిితి కన్పించడం లేదు. నేతల మధ్య సయోధ్య కుదరడం అసాధ్యమే.

Update: 2022-01-10 03:18 GMT

తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో కలహాలకు పుల్ స్టాప్ పడే పరిస్థిితి కన్పించడం లేదు. నేతల మధ్య సయోధ్య కుదరడం అసాధ్యమే. ఎన్నికల నాటికి మరింత ముదిరే అవకాశాలున్నాయి. రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ ఎంపిక తర్వాత విభేదాలు మరింత ముదరుతున్నాయి. ఇక కాంగ్రెస్ లో కొత్తగా వచ్చే నిబంధనలను రేవంత్ రెడ్డితో పాటు కొందరి నేతలకు ఇబ్బందికరంగా మారనున్నాయి. పీసీసీ చీఫ్ నుంచి జిల్లా అధ్యక్షుల వరకూ ఎవరూ ఎన్నికల్లో పోటీ చేయకూడదన్న నిబంధనను త్వరలో తేనున్నారు.

దేశవ్యాప్తంగా....
దేశవ్యాప్తంగా ఈ నిబంధనను అమలు చేయాలని రాహుల్ గాంధీ భావిస్తున్నారు. ఎన్నికల సమయంలో ప్రచారం నుంచి అభ్యర్థులను గెలిపించే బాధ్యత అంతా వారిపైనే ఉంటుంది. అంతే తప్ప వారు ఎన్నికల్లో పోటీ చేయడానికి వీలుండదు. ఇది దేశ వ్యాప్తంగా అందరూ పీసీసీ, జిల్లా అధ్యక్షులకు వర్తిస్తుంది. దీంతో జిల్లా అధ్యక్షులకు ఎలక్షన్ భయం పట్టుకుంది. తమకు టిక్కెట్ల కు దూరంగా పెడతారేమోనన్న భయం వెంటాడుతుంది.
తమను తప్పించాలని...
అనేక జిల్లాల నుంచి తమకు అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పించాలని కూడా అభ్యర్థనలు వస్తున్నట్లు సమాచారం. నిన్న మొన్నటి వరకూ జిల్లా అధ్యక్ష బాధ్యతలను స్వీకరించాలంటే పోటీ పడేవారు. కానీ కొత్త నిబంధన వస్తున్నట్లు ప్రచారం జరుగుతుండటంతో ఆ పదవికి దూరంగా ఉండాలని అనేక మంది నేతలు డిసైడ్ అయ్యారు. రేవంత్ రెడ్డికి నేరుగా అర్జీలు పెట్టుకుని, తమ స్థానంలో కొత్త వారిని ఎంపిక చేసుకోవాలని చెబుతున్నట్లు సమాచారం.
ఎన్నికలకు దూరంగా....
అదే సమయంలో కొందరు ఎన్నికలకు దూరంగా ఉండాలని కూడా భావిస్తున్నారు. వరసగా రెండు ఎన్నికల నుంచి ఓటమి పాలయిన వారు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పార్టీ అధికారంలోకి వస్తే ఏదో ఒక పదవి దక్కించుకోవచ్చని, అంతే తప్ప ఎన్నికల్లో పోటీ చేసి మరోసారి చేతులు కాల్చుకోలేమన్న ఉద్దేశ్యంతో ఉన్నారు. దీంతో బలమైన నేతల కోసం కాంగ్రెస్ ఇటు పార్టీ, అటు అభ్యర్థుల కోసం వెదుకులాట చేయాల్సి ఉంటుంది. మరో వైపు కలహాలు కూడా కాంగ్రెస్ కొంపముంచేలా ఉంది.


Tags:    

Similar News