కాంగ్రెస్ సీనియర్ నేతపై లైంగిక ఆరోపణలు

Update: 2018-08-06 06:24 GMT

భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ సీనియర్ నేత గండ్ర వెంకటరమణారెడ్డిపై ఓ మహిళ చేస్తున్న లైంగిక వేదింపుల ఆరోపణలు సంచలనంగా మారాయి. కొమురెల్లి విజయలక్ష్మీ అనే మహిళ మదర్ ఫౌండేషన్ ప్రతినిధిగా పనిచేసేది. ఆ సమయంలో గండ్రతో సాన్నిహిత్యం ఏర్పడి సహజీవనానికి దారితీసిందని ఆమె అంటున్నారు. గత ఐదేళ్లుగా తనను శారీరకంగా వాడుకున్నాడని, నాలుగు రోజులుగా మోహం చాటేస్తున్నాడని ఆరోపిస్తోంది. ఈ నెల 3వ తేదీన ఆయన ఇంటికి వెళ్తే పోలీసులతో అరెస్ట్ చేయించారని వాపోతోంది. తనకు న్యాయం చేయాలని, గండ్రపై నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తూ ఆదివారం గండ్ర నివాసం వద్ద ఆందోళన నిర్వహించింది. విజయలక్ష్మీ ఫిర్యాదు మేరకు పోలీసులు గండ్రపై కేసు నమోదు చేశారు.

రాజకీయంగా ఎదుర్కొలేక నీచ ఆరోపణలు

అయితే, తనపై విజయలక్ష్మి చేస్తున్న ఆరోపణలు అసత్యాలని గండ్ర వెంకటరమణారెడ్డి పేర్కొన్నారు. అధికార పార్టీ నేతలు తనను రాజకీయంగా ఎదుర్కోలేక ఇంతకు దిగజారి నీచమైన ఆరోపణలు చేస్తున్నారని ఆయన విమర్శంచారు. తన భర్త అలాంటి వారు కాదని వెంకటరమణారెడ్డి భార్య జ్యోతి అన్నారు. తమ పెళ్లయి 33 ఏళ్లు అవుతోందని, ఆయన ఎలాంటి వారో తనకు పూర్తిగా తెలుసని ఆమె స్పష్టం చేశారు. ప్రజల్లో తమకు వస్తున్న ఆదరణ చేసి ఓర్వలేక రాజకీయ కుట్రలో భాగంగా అధికార పార్టీ ఈ విధంగా చేస్తోందని ఆమె ఆరోపించారు.

Similar News