శబరిమలలో హైటెన్షన్

Update: 2018-10-17 03:58 GMT

కేరళలోని శబరిమలలో హైటెన్షన్ నెలకొంది. ఈరోజు సాయంత్రం అయ్యప్ప స్వామి మాస పూజల కోసం ఆలయాన్ని తెరవనున్నారు. అయితే ఇటీవల సుప్రీంకోర్టు శబరిమలలో అయ్యప్ప దర్శనానికి మహిళలను అనుమతిస్తూ తీర్పు చెప్పడంతో గత కొన్నిరోజులుగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కొందరు మహిళలు అయ్యప్ప దర్శనానికి వస్తున్నామని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అయ్యప్ప భక్తులు వారిని అడ్డుకునే ప్రయత్నం చేస్తామని చెబుతున్నారు. మనోభావాలకు వ్యతిరేకంగా నడుచుకోవద్దని, సంప్రదాయలను గౌరవించాలని వారు కోరుతున్నారు. శబరిమలలో పది నుంచి 55 సంవత్సరాల వయస్సుగల మహిళలకు ప్రవేశం నిషిద్ధం అనే బోర్డును ఆలయ కమిటీ తొలగించింది.

పనరయి హెచ్చరిక.....

సుప్రీంకోర్టు తీర్పును అమలు చేస్తామని ముఖ్యమంత్రి పినరయి విజయన్ తెలిపారు. అయ్యప్ప భక్తుల ముసుగులో అరాచకాలకు పాల్పడితే చూస్తూ ఊరుకోబోమని పినరయి విజయన్ హెచ్చరించారు. కోర్టు తీర్పును అందరూ గౌరవించాల్సిందేనన్నారు. దీంతో శబరిమలకు వెళ్లే ప్రధాన ద్వారమైన నిలక్కల్ వద్ద పెద్దయెత్తున బందోబస్తు ఏర్పాటు చేశారు. సాయంత్రానికి స్వామి గుడి తలుపులు తెరుచుకోనుండటంతో ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న టెన్షన్ సర్వత్రా నెలకొంది.

Similar News