ప్రణబ్ రాకపై అద్వానీ ఏమన్నారంటే?

Update: 2018-06-08 12:03 GMT

మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆర్ఎస్ఎస్ కార్యక్రమానికి హాజరుకావడాన్ని బీజేపీ సీనియర్ నేత ఎల్.కే.అద్వానీ స్వాగతించారు. దీనిని సమకాలిన దేశచరిత్రలో ముఖ్యమైన సంఘటనగా ఆయన అభివర్ణించారు. ప్రణబ్ ను ఈ కార్యక్రమానికి ఆహ్వానించడం పట్ల ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ను అభినందించారు. ఆర్ఎస్ఎస్ ఆహ్వానాన్ని మన్నించి కార్యక్రమానికి హాజరుకావడం పట్ల ప్రణబ్ ముఖర్జీని అద్వాణీ ప్రశంసించారు. భారత జాతీయవాదంపై గొప్ప ఆలోచనలను పంచుకోవడానికి ఇది ఉపయోగపడిందని అభిప్రాయపడ్డారు. సైద్ధాంతిక బేదాభిప్రాయాలను తుడుచి వేయడానికి వీరిద్దరి ప్రసంగాలు ఉపయోగపడ్డాయన్నారు. ఇద్దరూ తమ ప్రసంగాల ద్వారా దేశ గొప్పదనాన్ని, ఐక్యతను తెలియజేశారన్నారు. ప్రజా జీవితంలో సుదీర్ఘ అనుభవం ప్రణబ్ ను రాజనీతిజ్ఞుడిని చేశాయన్నారు. సైద్ధాంతిక, రాజకీయ బేధాభిప్రాయాలు ఉన్నవారి మధ్య ఉండాల్సిన పరస్పర సహకారం, సంబంధాల గురించి ఆయన తెలియచేశారని పేర్కొన్నారు.

విమర్శలు...ప్రశంసలు...

ఇక ప్రణబ్ ప్రసంగంపై కాంగ్రెస్ నేతలు కూడా ప్రశంసలు కురిపిస్తున్నారు. ఆర్ఎస్ఎస్ సైద్ధాంతాలలో ఉన్న తప్పులను ప్రణబ్ వారి వేదికపైనే చెప్పారని మాజీ కేంద్రమంత్రి చిదంబరం పేర్కొన్నారు. ఆ పార్టీ నేతలు రణదీప్ సుర్జేవాలా, ఆనంద్ శర్మలు సైతం ప్రణబ్ ను ప్రశంసించారు. ఇక మరో సీనియర్ నేత మనీష్ తివారీ మాత్రం ప్రణబ్ ను తప్పుపట్టారు. గతంలో దెయ్యంలా కనపడిన ఆర్ఎస్ఎస్ ఇప్పుడు ధర్మసంస్థలా ఎలా మారిందని ఆయన ప్రణబ్ ను ప్రశ్నించారు.

Similar News