డెడ్ లైన్ ముగుస్తుండగా

హుజూర్ నగర్ లో ఉప ఎన్నికల ప్రచారానికి రెండు రోజులే మిగిలి ఉంది. దీంతో ఈ రెండు రోజుల సమయాన్ని సద్వినియోగం చేసుకునేందుకు అన్ని పార్టీలు  పాచికలు [more]

Update: 2019-10-17 11:55 GMT

హుజూర్ నగర్ లో ఉప ఎన్నికల ప్రచారానికి రెండు రోజులే మిగిలి ఉంది. దీంతో ఈ రెండు రోజుల సమయాన్ని సద్వినియోగం చేసుకునేందుకు అన్ని పార్టీలు పాచికలు వేస్తున్నాయి. ఇప్పటి వరకు జరిగిన ప్రచారం కంటే భిన్నంగా ఓటర్లకు చేరువయ్యేందుకు వ్యూహాత్మకంగా ప్రణాళికలు రచిస్తున్నారు. ఇప్పటి వరకు చేసిన ప్రచారం ఒక ఎత్తైతే…. ఇప్పుడు రెండు రోజుల్లో చేసే ప్రచారం మరో ఎత్తు. ప్రచారాన్ని విస్రృతం చేసి ఓటర్లను ప్రసన్నం చేసుకోవడంపైనే అన్ని పార్టీలు దృష్టి సారించాయి.

వర్షార్పణం….

టిఆర్ఎస్ అభ్యర్థి సైదిరెడ్డి ఇప్పటి వరకు మంత్రులు, ఎమ్మెల్యేలతో కలిసి ప్రచారం చేశారు. ఈరోజు సీఎం కేసీఆర్ సభ ఏర్పాటు చేశారు. సీఎం కేసీఆర్ ఏమైనా హుజూర్ నగర్ కు వరాలు ఇస్తే తనకు ప్లస్ అవుతుందని సైదిరెడ్డి భావించారు. మరోవైపు పార్టీ కార్యకర్తలు కూడా సీఎం వస్తున్నారనే జోష్ లో ఉన్నారు. కాని వరుణుడి పుణ్యమానని సీఎం సభ రద్దుకావడంతో టిఆర్ఎస్ కార్యకర్తలు కొంత డీలా పడ్డారు. ఇక సభలు లేకుండా సాధారణ ప్రచారమే చేస్తామంటున్నారు పార్టీ వర్గాలు. సీఎం కేసీఆర్ మాటలను హుజూర్ నగర్ ప్రజలకు ఎలా చేరవేయాలో ఆలోచిస్తున్నామంటున్నారు మంత్రి జగదీశ్ రెడ్డి.

లేటెస్ట్ గా వస్తాడా…?

కాంగ్రెస్ సిట్టింగ్ సీటయిన హుజూర్ నగర్ లో రేపు కాంగ్రెస్ కార్యనిర్వాహాక అధ్యక్షుడు రేవంత్ రానున్నాడు. పీసీసీ ఛీప్ ఉత్తమ్ కుమార్ రెడ్డి భార్య పద్మావతికి మద్దతుగా ప్రచారం చేయనున్నారు. యూత్ లో మంచి పట్టున్న రేవంత్ వస్తే కాంగ్రెస్ కు లాభమని కార్యకర్తలు చెబుతున్నారు. రేవంత్ పర్యటిస్తే విజయావకాశాలు మెరుగుపడతా యంటున్నారు స్థానిక నాయకులు. మరోవైపు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బీజేపీ అభ్యర్థికి మద్దతుగా రేపు పలు మండలాల్లో ప్రచారం నిర్వహించనున్నారు.

జోష్ నింపేనా….

ఇక టీడీపీ సినీ గ్లామర్ ను తీసుకురానుంది. ఏపీ ఎమ్మెల్యే, సినీ నటుడు నందమూరి బాలకృష్ణ టీడీపీ అభ్యర్థి కిరణ్మయికి మద్దతుగా ప్రచారం చేయనున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత స్థబ్దుగా ఉన్న టీడీపీ శ్రేణుల్లో మళ్లీ కొంత జోష్ నింపేందుకు టీడీపీ అధిష్ఠానం ప్రయత్నిస్తోంది. రేపు, ఎల్లుండి అన్నిపార్టీల అధినేతల ప్రచారాలతో హుజూర్ నగర్ వేడెక్కనుంది.

 

 

Tags:    

Similar News