అవినీతి పోలీసుల లిస్టు ఇదే....

Update: 2018-06-07 13:30 GMT

పోలీస్ శాఖలో ఉన్న అవినీతి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అలా అని అందరూ అవినీతిపరులే అని కూడా చెప్పలేం. ప్రజలకు పారదర్శకంగా సేవలు అందించాలనే లక్ష్యానికి అనుగుణంగా పోలీసు సిబ్బంది పని చేయాలంటూ డీజీపీ మహేందర్‌రెడ్డి తరచూ సూచనలు చేస్తున్నారు. ప్రతి పోలీస్‌స్టేషన్‌లోనూ పనులను విభజించి మంచి ప్రతిభ కనబరిచిన సిబ్బందిని ప్రతీనెల ప్రోత్సహిస్తున్నారు. ఇదే క్రమంలో అవినీతి, అక్రమాలకు పాల్పడే సిబ్బందిపై కఠినంగా వ్యవహరిస్తున్నారు. ఇంత చేస్తున్నా ఇంకా అక్రమార్కుల వంకర బుద్ధి మాత్రం మారడం లేదు. ఈ విషయం ఒక వ్యక్తో, సంస్థనో, మీడియానో చెప్పట్లేదు. తెలంగాణ పోలీసు శాఖనే అవినీతిపరుల చిట్టాను విడుదల చేసింది.

టాప్ లో సూర్యాపేట...

తెలంగాణ పోలీసు శాఖలో మొత్తం 391 మంది అవినీతిపరులున్నారు. పోలీసు శాఖలోని అవినీతిపరుల జాబితాను డిజిపి కార్యాలయం స్వయంగా విడుదల చేసింది. సూర్యాపేట జిల్లాలో అత్యధికంగా 40 మంది అవినీతిపరులు ఉండగా, భద్రాద్రి కొత్తగూడెంలో 35, కరీంనగర్‌ లో 34, వికారాబాద్‌ లో 27, నిజామాబాద్‌లో 29 మంది అవినీతిపరులున్నారని ఈ జాబితాలో పేర్కొన్నారు. తాజాగా నిఘా వర్గాల నుంచి అక్రమార్కుల వివరాలను తెప్పించుకున్న డీజీపీ, హైదరాబాద్ సీపీ కార్యాలయం హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో అక్రమార్కులపై బదిలీ వేటు వేశారు. ఇందులో ఏఎస్సై నుంచి హోంగార్డు వరకు ఉన్నారు.

కేవలం కిందిస్థాయి వారేనా..?

హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని షాహినాథ్‌గంజ్‌కు చెందిన ఏఎస్సై బ్రహ్మం, కానిస్టేబుల్ మహేశ్, అసీఫ్‌నగర్ ఠాణాకు చెందిన హెడ్ కానిస్టేబుల్ కె.అలెగ్జాండర్, గోల్కొండ ఠాణాకు చెందిన కానిస్టేబుల్ పి.నగేశ్, టప్పాచబుత్ర ఠాణాకు చెందిన కానిస్టేబుల్ బి.శ్రీకాంత్, మంగళ్‌హాట్ ఠాణాకు చెందిన కానిస్టేబుల్ వై.సాంబయ్య, ఎ.బాలనర్సయ్య, కుల్సుంపురాకు చెందిన హోంగార్డు వేణు, పంజాగుట్టకు చెందిన శంకర్‌నాయక్, చిలుకలగూడకు చెందిన హోంగార్డులు రాంసింగ్, నాగరాజ్‌లపై బదిలీ వేటు పడింది. వీళ్లంతా మద్యం దుకాణాలు, బార్లు, కల్లు దుకాణాలు, వాణిజ్య సంస్థలు, హోటల్స్‌ తోపాటు కేసులు ఎదుర్కొనే నేరస్తుల నుంచి డబ్బులు వసూళ్లకు పాల్పడుతున్నారు. ఇందులో కొందరు ఎస్సైల తరఫున వసూళ్లకు పాల్పడుతున్నట్లుగా నిఘా వర్గాల నుంచి ఉన్నతాధికారులకు సమాచారం వచ్చింది. దీంతో వారిపై ఉన్నతాధికారులు చర్యలకు ఉపక్రమించారు. అయితే, బదిలీలకు గురైన వారిలో హోంగార్డుల నుంచి ఏస్సై వరకు ఉన్నారు. మరి అవినీతిపనులు కేవలం కిందిస్థాయిలోనే ఉన్నారా, అంతకంటే పై స్థాయి అధికారులపై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

Similar News