పోలీసులు బూజు దులిపి....

Update: 2018-05-10 03:47 GMT

పోక్సో చట్టం.. ఇండియన్ పీనల్ కోడ్ లో ఇది చాలా టాప్ యాక్టు.. దీని గురించి ఎంత మందికి తెలుసని సర్వే చేస్తే చాలా తక్కువ మందికే తెలిసినట్లు తేలింది. వాస్తవానికి చిన్నారులను కామాంధుల బారి నుండి రక్షించడమే కాదు ప్రభుత్వ పరంగా చేయుత నందించే చట్టం ఇది. ఇటీవల కాలంలో మన పోలీసులు ఈ అస్త్రాన్ని ప్రయోగిస్తున్నారు. ఇంతకీ ఈ చట్టం ఎప్పుడు ప్రవేశపెట్టారు. ఇది ఎలా అమలు జరుగుతుంది. పోక్సో యాక్ట్ 2012 మే 22వ తేదీన పార్లమెంట్ లో ప్రవేశపెట్టిన బిల్లు.. అనంతరం నవంబర్ 2012 నుండి ఈ చట్టం అమలు లోకి వచ్చింది. దీని ముఖ్యఉద్దేశ్యం ఎవరైనా చిన్నారులను లైంగికంగా వేధించినా.. వారిపై అత్యాచారం చేసినా, ప్రైవేట్ పార్ట్ లను తాకినా, ఫోర్న్ వీడియోస్ చూపించినా సరే నిందితులపై పోలీసులు పోక్సో చట్టం ప్రయోగిస్తారు. 18 సంవత్సరాల లోపు బాల, బాలికలెవరిపైనైనా సెక్సువల్ హరాస్ మెంట్ జరిగిందంటే చాలు ఈ చట్టాన్ని ప్రయోగించి తీరాల్సిందే. అంతే కాదు ఈ ఘటన జరిగిన వెంటనే జిల్లా కలెక్టర్ వెంటనే స్పందించి బాధితులకు పరిహారం అందించడమే కాకుండా, వారికి చేయూత నందించాల్సిన అవసరం ఉందని ఈ యాక్టులో పొందు పర్చడం జరిగింది. నిందితుడిపై సెక్షన్ 354, 375, 377 ఐపిసి కింద కేసులు నమోదు చేస్తారు. నేరం రుజువు అయితే చాలు నిందితుడికి పది నుండి 18 సంవత్సరాల కఠిన కారాగారశిక్ష పడుతుంది. ఇది పోక్సో అస్త్రానికి ఉన్న పవర్.. మొదట్లో ఈ చట్టం అమలు జరిగినా ఆ తరువాత రాజకీయ వత్తిళ్లకు ఈ యాక్టు మరుగునపడింది. అయితే ఇటీవల కాలంలో మహిళలు, యువతులపై జరుగుతున్న లైంగిక దాడులు, వేధింపులను అరికట్టేందుకు నిర్భయ యాక్టు అమలు లోకి వచ్చింది.

చిన్నారులపై లైంగిక దాడులు....

ఇటీవల కాలంలో చిన్నారులపై లైంగిక దాడులు విఫరీతంగా పెరిగిపోవడం.. నిత్యం పదుల సంఖ్యల్లో పోలీసు స్టేషన్ లలో కేసులు నమోదు కావడంతో పోలీసు శాఖ మరోసారి మరుగున పడిన ఈ పోక్సో చట్టాన్ని బయటకు తీసింది. బూజుపట్టిన ఫైళ్లను దులిపి ఆ ఆయుధానికి మరోసారి పదును పెట్టింది. చిన్నారులపై లైంగిక వేధింపులు, దాడి అని తెలిస్తే చాలు వారిపై పోక్సో చట్టం ప్రయోగించి నిందితులను కోర్టు ముందు ఉంచుతోంది. అందుకు ఉదాహరణ, ఇటీవల ఆసిఫ్ నగర్ లోని ఓ మదరసాలో 9 మంది ఆరేళ్ల చిన్నారులపై మాస్టార్ లైంగిక దాడిలో నిందితుడిపై పోలీసులు ఈ యాక్టునే ప్రయోగించారు. అలాగే సనత్ నగర్ లో కూతురి వయస్సున్న అమ్మాయిపై దాడి చేసిన స్టెప్ ఫాదర్ కి కూడా ఇదే చట్టం అమలు చేశారు. అయితే ఇటీవల పోలీసులు ప్రయోగిస్తున్న ఈ అస్త్రాన్ని ఒక్క సారి పరిశీలిస్తే.. నిందితులంతా చిన్నారులకు బంధువులే కావడం సిగ్గు చేటు.

బంధువులే కావడంతో.....

తల్లిదండ్రులు లేని మేన కోడలిపై మామ లైంగిక దాడి, కూతురిపై తండ్రి అత్యాచారం... వేదింఫుల కేసుల్లో స్టెప్ ఫాదర్ అరెస్ట్ ఘటనలే చోటుచేసుకుంటున్నాయి. పోక్సో చట్టం వారందరిపై ప్రయోగించినా నిందితులు బాధితులకు బంధువులు కావడంతో పోలీసులు తలపట్టుకు కూర్చుంటున్నారు. శిక్ష పడే సమయానికి నయానో భయాన్నే, చివరకు కాళ్లపై పడో కేసు విత్ డ్రా చేసుకునే చేస్తున్నారని చెబుతున్నారు పోలీసులు. ఫలితంగా చిన్నారులను రక్షించేందుకు తీసుకువచ్చిన పోక్సో యాక్ట్ నీరుగారిపోతోందని పోలీస్ అధికారుల వాదన. అందుకే చాలా సందర్భాల్లో 375 రేప్ కేస్ నమోదు చేసి వదిలివేయడం జరుగుతోంది చెబుతున్నారు. ఈ చట్టం సక్రమంగా అమలు జరగాలి అంటే బాలికతో పాటు వారి కుటుంబ సభ్యులకు సైతం మనో దైర్యం ఎక్కువగా ఉండాలని అంటున్నారు పోలీసులు. మొత్తానికి మహిళలకు రక్షణగా నిర్భయ యాక్ట్ ఎలా ఉందో చిన్నారుల కోసం పోక్సో చట్టం అలాగే ఉంది. ఇటీవల చిన్నారులపై లైంగిక దాడులకు పాల్పడితే ఉరి శిక్షే అని సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేయడంతో పోలీసులు కాస్త ఊపిరిపీల్చుకున్నారు. అందుకే కేసు తీవ్రతను బట్టి ఈ యాక్టును ప్రయోగిస్తున్నారు.

Similar News