సాకే సీటుకు ఎసరు.. కొత్త చీఫ్ ఎవరో?

ఏపీ కాంగ్రెస్ పై పార్టీ కేంద్ర నాయకత్వం ప్రత్యేక దృష్టి సారించింది. రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేయాలని నిర్ణయించింది

Update: 2021-12-11 06:27 GMT

ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పై పార్టీ కేంద్ర నాయకత్వం ప్రత్యేక దృష్టి సారించింది. రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేసేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. తొలుత నాయకత్వాన్ని మార్చాలన్న నిర్ణయానికి వచ్చింది. ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలకు ఇంకా మూడేళ్ల గడువు ఉంది. ఈ మూడేళ్లలో పార్టీని బలోపేతం చేసే నేత కోసం కాంగ్రెస్ వెతుకులాట ప్రారంభించింది. హైకమాండ్ ఇప్పటికే సీనియర్ నేతల నుంచి అభిప్రాయాలను సేకరించింది.

ఈ నెల 21, 22 తేదీల్లో...
పార్టీ వ్యవహారాల ఇన్ చార్జి ఈ నెల 21, 22 తేదీల్లో విజయవాడకు రానున్నారు. స్థానిక నేతల అభిప్రాయాన్ని కూడా తీసుకోనున్నారు. నాయకత్వ మార్పిడి అవసరమని కాంగ్రెస్ అధినాయకత్వం గట్టిగా భావిస్తుంది. తెలంగాణ, కర్ణాటకల్లో నాయకత్వాన్ని మార్చిన తర్వాత పార్టీ బలోపేతం కావడమే కాకుండా, క్యాడర్ లో జోష్ పెరిగిన విషయాన్ని ఈ సందర్భంగా కొందరు నేతలు గుర్తు చేస్తున్నారు.
బలోపేతం కాకపోవడంతో...
పీసీసీ అధ్యక్షుడిగా సాకే శైలజనాధ్ బాధ్యతలను తీసుకుని రెండేళ్లు పూర్తయింది. అయితే ఈ రెండేళ్లలో కాంగ్రెస్ బలోపేతం అయిందా? అంటే లేదనే చెప్పాలి. ఏ ఎన్నికలోనూ పనితీరు కనపర్చ లేకపోయింది. నేతల మధ్య సమన్వయం కూడా లోపించింది. ఏ కార్యక్రమంలోనూ పట్టుమని ఇద్దరు ముఖ్య నేతలు పాల్గొన్న దాఖలాలు లేవు. తిరుపతి, బద్వేలు ఉప ఎన్నికలకు కూడా సీనియర్ నేతలు దూరంగా ఉన్నారు.
కొత్త నేతకు....
దీంతో పార్టీ అధినాయకత్వం బలమైన నేతను పీసీసీ చీఫ్ గా నియమించాలని భావిస్తుంంది. రెడ్డి లేదా కాపు సామాజికవర్గం నుంచి నేతను ఎంపిక చేసే అవకాశాలున్నాయి. పార్టీ బలోపేతమయితేనే ఇతర పార్టీలు పొత్తు పెట్టుకునేందుకు ముందుకు వస్తాయని హైకమాండ్ భావిస్తుంది. అందుకే సాకే శైలజనాధ్ ను తప్పించడం ఖాయం. ఆయన స్థానంలో ఎవరు వస్తారన్నది ఆసక్తికరంగా మారింది. వచ్చే నెల మొదటి వారానికి దీనిపై స్పష్టత వచ్చే అవకాశముంది.


Tags:    

Similar News