లోపల టీడీపీ...బయట వైసీపీ

Update: 2018-07-18 07:32 GMT

పార్లమెంట్ సమావేశాలు బుధవారం ప్రారంభమయ్యాయి. గత బడ్జెట్ సమావేశాల్లో రాష్ట్రానికి న్యాయం చేయాలంటూ ఆందోళనలు చేసిన ఏపీ ఎంపీలు ఈ సమావేశాల మొదటి రోజే ప్రారంభించారు. లోక్ సభలో తెలుగుదేశం పార్టీ ఎంపీలు సభ ప్రారంభం కాగానే స్పీకర్ పోడియం వద్దకు వచ్చి ప్లకార్డులు పట్టుకుని నినాదాలు చేస్తున్నారు. గత సమావేశాల్లో పెట్టిన అవిశ్వాస తీర్మాణంపై చర్చ జరపాలని, ఆంధ్రప్రదేశ్ కు న్యాయం చేయాలని నినాదాలు చేస్తున్నారు. దీంతో సభలో గందరగోళం నెలకొంది. ఎంపీల ఆందోళన మధ్యే లోక్ సభ ప్రశ్నోత్తరాలు కొనసాగుతున్నాయి. ఇక రాజ్యసభలోనూ ఏపీ ఎంపిలు ఆందోళన చేశారు. అన్ని విషయాలపై రెండుమూడు రోజుల్లో చర్చ జరుపుదామని రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్య నాయుడు విజ్ఞప్తి చేసిన వినలేదు. దీంతో రాజ్యసభను మధ్యాహ్నానికి వాయిదా వేశారు.

పార్లమెంట్ వెలుపల వైసీపీ ఆందోళన

రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీగా ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ కూడా పార్లమెంట్ లో ఆందోళనకు దిగింది. రాజ్యసభలో ఆ పార్టీ ఎంపీలు విజయసాయిరెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని ప్లకార్డులు పట్టుకుని నినాదాలు చేశారు. సభ వాయిదా పడ్డ అనంతరం పార్లమెంట్ వెలుపల గాంధీ విగ్రహం వద్ద ఆందోళన కొనసాగించారు. అయితే, తమ రాజ్యసభ ఎంపీలకు సంఘీభావం తెలిపేందుకు పార్లమెంటుకు వెళ్లిన వైసీపీ తాజా మాజీ ఎంపీలను మొదట అనుమతించలేదు. అయితే, సంఘీభావం తెలపాడానికి అనుమతించడంతో వారు రాజ్యసభ సభ్యులతో కలిసి ఆందోళన చేస్తున్నారు.

Similar News