మరో కొత్త పార్టీ ఆవిర్భావం..!

Update: 2018-09-05 09:08 GMT

తెలంగాణలో మరో కొత్త పార్టీ ఆవిర్భవించింది. ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఒకప్పుడు సన్నిహితుడిగా మెలిగిన భువనగిరికి చెందిన జిట్టా బాలకృష్ణారెడ్డి నేతృత్వంలో బుధవారం హైదరాబాద్ లో ‘యువ తెలంగాణ’ పార్టీ ఆవిర్భావం జరిగింది. ఈ పార్టీకి జిట్టా బాలకృష్ణారెడ్డి అధ్యక్షుడిగా వ్యవహరిస్తుండగా, జర్నలిస్టు రాణి రుద్రమ కూడా కీలకంగా పనిచేయనున్నారు. యువ తెలంగాణ పార్టీ యువత, మహిళలకు ప్రాధాన్యత ఉంటుందన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్, టీఆర్ఎస్ ప్రభుత్వ పాలనపై జిట్టా తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

రెండుసార్లూ గట్టి పోటీ ఇచ్చినా..?

మొదట టీఆర్ఎస్ లో కొనసాగిన జిట్టా భువనగిరిలో టీఆర్ఎస్ బలోపేతానికి బాగానే కష్టపడ్డారు. 2009లో ఆయన టీఆర్ఎస్ టిక్కెట్ ఆశించగా పొత్తులో భాగంగా టీడీపీ పోటీ చేసింది. దీంతో ఆయన ఇండిపెండెంట్ గా పోటీ చేసి భారీగా ఓట్లు సంపాదించుకున్నారు. ఆ తర్వాత ఆయన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరినా, ఆ పార్టీ సమైక్యవాదాన్ని ఎత్తుకోవడంతో జిట్టా వైసీపీకి దూరమయ్యారు. 2014లోనూ ఇండిపెండెంట్ గా బరిలోకి దిగిన ఆయన మళ్లీ గట్టి పోటీ ఇచ్చి రెండో స్థానంలో నిలిచారు. ఈసారి కూడా ఆయన భువనగిరి నుంచి పోటీ చేసే అవకాశం ఉంది. ఇక జర్నలిస్టు రాణి రుద్రమ ఉమ్మడి వరంగల్ జిల్లాలోని నర్సంపేట నియోజకవర్గం నుంచి పోటీ చేసే అవకాశం కనిపిస్తోంది.

Similar News