లోకేష్ ఎంతమాటన్నారు?

Update: 2018-05-28 08:11 GMT

విజయవాడలో జరుగుతున్న తెలుగుదేశం పార్టీ మహానాడులో మంత్రి లోకేష్ తన మార్కు ప్రసంగం చేశారు. ప్రతిపక్ష నాయకులు జగన్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, బీజేపీపై విమర్శలతో పాటు తన తండ్రి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై ప్రశంసల వర్షం కురిపించారు. మన కోసం, మన పిల్లల భవిష్యత్ కోసం ఈ వయస్సులోనూ చంద్రబాబు నాయుడు రాత్రింబవళ్లు కష్టపడుతున్నారని, ఆయన స్పీడును యువకుడైన తాను కూడా అందుకోలేక పోతున్నానన్నారు. స్వాతంత్రం వచ్చిన 70 ఏళ్లలో కాని అభివృద్ధి ఇప్పుడు చేశారని తెలిపారు. రాష్ట్రంలో లోటు బడ్జెట్ ఉన్నా కూడా మనకు లోటు లేకుండా చూసేందుకు అనుక్షణం కష్టపడుతున్నారన్నారు. గ్రామాల అభివృద్ధి చంద్రబాబు వల్లె జరిగిందని, ఇవాళ ప్రతిపక్ష నాయకులు నడుస్తున్న రోడ్లను తామే వేశామన్నారు. ఇక విపక్ష నేతలు తనపై కావాలనే ఆరోపిస్తున్నారని, తాను తాత ఎన్టీఆర్ పేరు చెడగొట్టేలా పనిచేయనని మరోసారి స్పష్టం చేశారు.

వెంకన్నతో రాజకీయాలు చేస్తున్నారు...

తనపై ఆరోపణలు చేస్తున్న వారు ఎక్కడ తాను తప్పు చేశానో నిరూపించాలన్నారు. ఉద్దానం కోసం ముఖ్యమంత్రి అన్నీ చేస్తున్నా విమర్శించడం సరికాదని, సొంత నియోజకవర్గానికి ఇవ్వాల్సిన ఆర్వోసీ ప్లాంట్లను ఉద్దానానికి కేటాయించారిన తెలిపారు. ప్రతిపక్ష పార్టీల నాయకులు కులాలు, మతాలు, ప్రాంతాల మధ్య చిచ్చుపెడుతున్నాయని విమర్శించారు. చివరకు వెంకన్నతో కూడా రాజకీయాలు చేస్తున్నారని, గతంలో ఇలానే వెంకన్నతో పెట్టుకున్నవాళ్లు మాడి మసైపోయారని, ఇప్పుడు కూడా వెంకన్న జోలికి వెళ్లిన వారు బతకరని హెచ్చరించారు.

Similar News