ఏందబ్బయా...ఇది.. ఇంకెవరు నెక్ట్స్ ...?

కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అయితే వచ్చే ఎన్నికల్లో తాను టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దిగనున్నట్లు క్యాడర్ కు క్లారిటీ ఇచ్చారు

Update: 2023-02-01 05:21 GMT

ఎన్నికలు దగ్గరపడే సమయంలో జంపింగ్ లు సర్వసాధారణమే. వచ్చే ఎన్నికల్లో తమకు టిక్కెట్ రాదనుకున్న నేతలు ముందుగానే పార్టీలను ఫిరాయించడం పరిపాటి. ఏమాత్రం టిక్కెట్ రాదని డౌటున్నా సరే.. వెంటనే తాము ఉన్నా పార్టీపై ఆరోపణలు చేయడం, వెంటనే తమకు సీటు ఖరారు చేసే పార్టీలోకి ఫిరాయించడం మామూలే. 2019 ఎన్నికలకు ముందు ఎంపీలు, ఎమ్మెల్యేలు కూడా టీడీపీ నుంచి వైసీపీలోకి జంప్ అయ్యారు. తమకు టిక్కెట్ ఇచ్చిన నాయకత్వంపైనే సూటిగా విమర్శలు చేస్తారు. నాయకత్వంలో ఉన్న లోపాలను, పార్టీలో ఉన్న లొసుగులను ప్రస్తావిస్తారు. అంతే కాదు... తాము ఎన్ని అవమానాలకు గురయిందీ ప్రజలకు వివరించే ప్రయత్నం ఖచ్చితంగా చేస్తారు.

రాజకీయ భవిష‌్యత్ కోసం...
ఇప్పుడు వైసీపీ లో అదే జరుగుతుంది. మొన్న ఆనం రామనారాయణరెడ్డి.. నేడు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఇద్దరూ ప్రభుత్వంపై ఆరోపణలకు దిగారు. తమ ఫోన్లు ట్యాపింగ్ చేశారంటూ తీవ్రస్థాయి విమర్శలు చేస్తున్నారు. తమపై అనుమానం వచ్చి తమపై నిఘా పెట్టేందుకే ఫోన్లను ట్యాప్ చేస్తున్నారని చెబుతున్నారు. అధికారంలో ఉన్న పార్టీ కావడంతో తాము ఫిర్యాదు చేయలేకపోతున్నామని కూడా వివరణ ఇచ్చుకుంటున్నారు. తమ దగ్గర పక్కా ఆధారాలున్నాయంటున్న ఇరువురు నేతలు వచ్చే ఎన్నికల్లో తమ భవిష‌్యత్ ను ముందుగానే నిర్ణయించుకున్నట్లు కనపడుతుంది.

టీడీపీలో సీటు కన్ఫర్మ్...
కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అయితే ఏకంగా వచ్చే ఎన్నికల్లో తాను టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దిగనున్నట్లు క్యాడర్ కు క్లారిటీ ఇచ్చారు. ఆయన ఆడియో లీకవ్వడం ద్వారా ఇది బయటపడింది. నెల్లూరు రూరల్ నియోజకవర్గం నుంచే పోటీ చేస్తానని కూడా చెప్పారు. అంటే ముందుగానే ఆయన టీడీపీ అధినాయకత్వం నుంచి కన్ఫర్మ్ చేసుకున్నట్లు అర్థమవుతుంది. తాను పార్టీలో చేరితే టిక్కెట్ విషయంలో క్లారిటీ తీసుకున్న తర్వాతనే కోటంరెడ్డి వైసీపీపై విమర్శల జోరు పెంచారనడంలో ఏమాత్రం సందేహం లేదు. నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి ఇన్‌ఛార్జిగా తొలుత ఆయన సోదరుడు గిరిధర్ రెడ్డిని నియమించాలనుకున్నప్పటికీ పార్టీ హైకమాండ్ ఆ ఆలోచనను విరమించుకున్నట్లు తెలిసింది. కొత్త నేత కోసం వైసీపీ అన్వేషణ చేస్తుందంటున్నారు. బహుశ ఆనం విజయకుమార్ రెడ్డిని నియమించవచ్చన్న టాక్ పార్టీలో నడుస్తుంది.
చికాకులు తప్పవు...
ఆనం రామనారాయణరెడ్డి ఇప్పటికే ఎగ్జిట్ కు రెడీ అయిపోయారు. విడతల వారీగా వీరు పార్టీకి రాజీనామా చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎన్నికలకు పదిహేను నెలల సమయం ఉండటంతో ఇప్పుడే పార్టీని వీడే అవకాశం లేదు. ఎన్నికలకు ఆరు నెలల ముందే వీరిద్దరూ జంప్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అప్పటి వరకూ వీరి నుంచి అధికార పార్టీకి చికాకులు తప్పవు. విమర్శల జోరు కూడా పెంచే అవకాశాలు లేకపోలేదు. పార్టీ సస్పెండ్ చేస్తే వారికే మంచిది. ఎమ్మెల్యేగా చివరి వరకూ కొనసాగవచ్చు. అయితే పార్టీ ఆ నిర్ణయం తీసుకోకపోవచ్చు. అందుకే ఇద్దరు నేతలు హైకమాండ్ కు తలనొప్పిగా మారతారనడంలో ఎటువంటి సందేహం లేదు. అందుకు వైసీపీ కూడా సిద్ధంగా ఉండాలి.

మరికొందరు వీడే ఛాన్స్....
ఇక వైసీపీ నుంచి ఎవరెవరు వెళ్లే అవకాశాలున్నాయన్న దానిపైన కూడా పార్టీలో జోరుగా చర్చ జరుగుతుంది. నెల్లూరు జిల్లా నేతలే మరికొందరున్నారని చెబుతున్నారు. జగన్ కు అతి సన్నిహితమైన కుటుంబం నుంచి ఒక సిట్టింగ్ ఎమ్మెల్యే ఇదే జిల్లాలో వైసీపీని వీడే అవకాశముందని చెబుతున్నారు. ఇది ఒక్క నెల్లూరుకే కాదని ఇతర జిల్లాల నుంచి నేతలు తమ పార్టీలోకి వచ్చే అవకాశముందని చెబుతున్నారు. ముఖ్యంగా తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల నుంచి నేతల వలసలు ఉండే అవకాశముందంటున్నారు. మంత్రి పదవులు దక్కకపోవడమే ప్రధానంగా అనేక మంది నేతలు వైసీపీలో అసంతృప్తిగా ఉన్నారన్నది వాస్తవం. వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేన కలిసి పోటీ చేస్తుండటంతో తమ గెలుపు అవకాశాలు మరింత మెరుగుపడతాయన్నది పలుచోట్ల నేతల భావన. అయితే సీటు కన్ఫర్మ్ కావాలి. కన్ఫర్మ్ అయితే మరో నేత నెల్లూరు నేతల బాట పట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి జగన్ వలసలకు అడ్డుకట్ట వేయగలరా? లేదా? అన్నది చూడాల్సి ఉంది.


Tags:    

Similar News