అరె తినకుండా....బరువు పెరిగారే...!

Update: 2018-06-16 13:16 GMT

ఏవైనా హక్కులు సాధించుకునేందుకు నాయకులు నిరాహార దీక్ష చేయడం తరచూ చూస్తూనే ఉంటాం. వీరి దీక్షలు ఒక్కోసారి ఫలిస్తాయి. కొన్నిసార్లు ఆసుప్రతులకు చేరి విరమిస్తాయి. నిరాహార దీక్ష చేస్తే క్రమంగా మనిషి బలహీనం అవుతారు. బరువు తగ్గుతారు. షుగర్ లెవల్స్ తగ్గిపోతుంది. కానీ, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా, ఆరోగ్య శాఖ మంత్రి సత్యేంద్ర జైన్ చేస్తున్న దీక్షలో మాత్రం ఇందుకు విరుద్ధంగా జరుగుతోంది. రాష్ట్ర హక్కుల్ని కేంద్రం కాలరాస్తోందని అరవింద్ కేజ్రీవాల్ ఇద్దరు సహచర మంత్రులతో కలిసి ఐదు రోజులుగా ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అనీల్ బైజాల్ కార్యాలయంలో నిరాహార దీక్ష చేస్తున్న సంగతి తెలిసిందే.

దీక్షకు కూర్చుని తింటున్నారు...?

అయితే, దీక్ష చేస్తున్న వారిని వైద్యులు పరీక్షించి వారి ఆరోగ్య పరిస్థితిని వెల్లడించడం కూడా జరిగేదే. వీరి ఆరోగ్య పరిస్థితి చూడగా, ఐదు రోజులుగా దీక్ష చేస్తున్నా ఆరోగ్య శాఖమంత్రి సత్యేంద్ర జైన్ 1.5 కిలోల బరువు పెరిగారు. అంతకుముందు 80 కిలోలు ఉన్న ఆయన ఇప్పుడు 81.5 కిలోలు ఉన్నారు. ఆరోగ్య శాఖ మంత్రి అయిన ఆయనకు ఇలా ఆహారం మానేసీ బరువు పెరిగే కిటుకు ఏమైనా తెలుసా అని ఇప్పుడు ప్రత్యర్థులు ప్రశ్నిస్తున్నారు. ముఖ్యంగా ఆ పార్టీ తిరుగుబాటు నేత కపిల్ మిశ్రా ట్విట్టర్ వేదికగా వీరిపై విమర్శలు చేస్తున్నారు. సత్యేంద్ర మెడికల్ చెకప్ కి నిరాకరించారని, తీరా చూస్తే బరువు పెరిగారని పేర్కొన్నారు. మనీష్ సిసోడియా కూడా ఆరోగ్యంగా ఉన్నారన్నారు. వీరు నిరాహార దీక్షలో కూర్చుని ఆహారం తీసుకుంటున్నారనేది ఆయన ఆరోపణ. మరి వాస్తవమేమిటో వారికే తెలియాలి.

Similar News