బడ్జెట్ చూస్తే అర్థమయిపోలే

కేసీఆర్ శాసనసభలో ప్రవేశ పెట్టిన బడ్జెట్ ను చూస్తే ముందస్తు ఎన్నికలు వెళతారన్న ప్రచారం రాజకీయ వర్గాల్లో మరింత ఊపందుకుంది

Update: 2022-03-08 04:30 GMT

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళతారన్న ఊహాగానాలు ఎప్పటి నుంచో ఉన్నాయి. ఆయన ముందస్తు ఎన్నికలకు వెళ్లి మూడోసారి ముఖ్యమంత్రి పీఠాన్ని దక్కించుకోవాలని తహతహలాడుతున్నారు. ఇప్పుడు నిన్న ప్రవేశ పెట్టిన బడ్జెట్ ను చూసినా ముందస్తు ఎన్నికలు వెళతారన్న ప్రచారం రాజకీయ వర్గాల్లో మరింత ఊపందుకుంది. కేసీఆర్ కు నిజానికి మరో బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశముంది.

వచ్చే ఏడాది....
తెలంగాణ శాసనసభ ఎన్నికలు వచ్చే ఏడాది జరగాల్సి ఉంది. వచ్చే ఏడాది బడ్జెట్ ను ప్రవేశపెట్టి ఎన్నికలకు వెళ్లే వీలుంది. కానీ నిన్న శాసనసభలో ప్రవేశపెట్టిన బడ్జెట్ ను చూస్తుంటే ఎన్నికల బడ్జెట్ అని అనిపించక మానదు. సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేశారు. దళితబంధు వంటి పథకాలతో పాటు డబుల్ బెడ్ రూం ఇళ్లు వంటి వాటికి అధికంగా కేటాయింపులు చేశారు. నిజానికి దళిత బంధు గురించే కేసీఆర్ ముందస్తు ఆలోచనలను చేస్తున్నారంటున్నారు.
దళిత బంధు...
దళిత బంధుకు ఈ ఏడాది బడ్జెట్ లో 17 వేల కోట్లు మాత్రమే కేటాయించారు. అంటే తెలంగాణలో ఉన్న దళితులందరికీ ఈ పథకాన్ని వర్తింప చేయాలంటే సమయం సరిపోదు. సరిపడా నిధులు ఉండవు. అందుకే ఈ పథకం మధ్యలో ఉండగానే ఎన్నికలకు వెళ్లలాలన్నది కేసీఆర్ ఆలోచన. తిరిగి కేసీఆర్ ముఖ్యమంత్రి అయితే దళిత బంధు పథకాన్ని అమలు చేస్తారని ఆ సామాజికవర్గం ఓటర్లంతా అండగా నిలిచే వీలుంది.
జాతీయ రాజకీయాల్లోకి....
మరోవైపు ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ సాధించే ఫలితాలను బట్టి కేసీఆర్ జాతీయ రాజకీయల్లోకి వెళతారంటున్నారు. బీజేపీ కనుక ఈ ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో సరైన ఫలితాలు సాధించలేకపోతే తాను ముందస్తు ఎన్నికలకు వెళ్లి లోక్ సభ ఎన్నికల నాటికి ఢిల్లీలో కీలకంగా మారాలన్న ఆలోచనలో ఉన్నారు. దీంతోనే జనరంజక బడ్జెట్ ను ఆయన ప్రవేశపెట్టారని పొలిటికల్ క్యారిడార్స్ లో చర్చ జరుగుతుంది. మరి బడ్జెట్ ను చూస్తే మధ్యంతరం అని అనిపిస్తూనే ఉంది.


Tags:    

Similar News