ముఖ్యమంత్రి కేసీఆర్ కి మరో తలనొప్పి

Update: 2018-06-01 07:17 GMT

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కి మరో తలనొప్పి ఎదురుకానున్నట్లే కనపడుతోంది. ఇప్పటికే ఉద్యోగాలు భర్తీ చేయడం లేదని టీఆర్ఎస్ ప్రభుత్వంపై నిరుద్యోగులు తీవ్ర ఆగ్రహంతో ఉన్న విషయం ఒప్పుకోవాల్సిందే. అయితే, ప్రభుత్వం తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా 18 వేలకు పైగా పోలీస్ ఉద్యోగాల భర్తీకి నిన్న నోటిఫికేషన్ విడుదల చేసింది. దీంతో నిరుద్యోగుల్లో ఉద్యోగాలపై ఆశలు రేగాయి. కానీ, నిరుద్యోగులు ఆశించిన వయోపరిమితి సడలింపునకు ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. జనరల్ అభ్యర్థులకు కానిస్టేబుల్ కి 22 ఏళ్లు, ఎస్సైకి 25 ఏళ్ల వయోపరిమితి నిర్ణయించారు. దీంతో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న ఎక్కువ శాతం మంది యువత ఆశలపై నీళ్లు చల్లినట్లయింది.

వయో పరిమితి పెంచాల్సిందే...

అయితే, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత వచ్చిన భారీ నోటిఫికేషన్ ఇది. గతంలో పోలీస్ ఉద్యోగాలకు ఒక నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు వయోపరిమితిని సడలించారు. దీంతో ఇప్పుడు కూడా నిరుద్యోగులు అదే ఆశించారు. ఇప్పుడు సడలింపు లేదని తేలడంతో వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నరు. శుక్రవారం అశోక్ నగర్ లో నిరుద్యోగులు రోడ్డెక్కారు. ఆరేళ్లు వయోపరిమితి పెంచాలని డిమాండ్ చేస్తూ ధర్నా నిర్వహించారు. నాలుగేళ్లకు వచ్చిన భారీ నోటిఫికేషన్ అయినందున కనీసం మూడేళ్లయినా వయోపరిమతిని సడలించాలని కోరుతున్నారు. ముఖ్యమంత్రి స్పందించాలని, లేకపోతే ఆందోళన తీవ్రతరం చేస్తామంటున్నారు. అయితే, ఇంతకాలం ఉద్యోగాలు భర్తీ నోటిఫికేషన్లు వేయడం లేదనే నిందను ఇంతకాలం ప్రభుత్వం మూటగట్టుకోగా, ఇప్పుడు నోటిఫికేషన్ ఇచ్చినా కొత్త తలనొప్పి చుట్టుకుంది.

Similar News