బ్రేకింగ్ : కనిపిస్తే కాల్చివేత ఉత్తర్వులు ఇవ్వాల్సి వస్తుంది…వార్నింగ్

రాష్ట్రంలో ఇప్పటి వరకూ 36 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. వారిలో ఒకరు డిస్ ఛార్జి అయ్యారని కేసీఆర్ చెప్పారు. దాదాపు 19 [more]

Update: 2020-03-24 14:28 GMT

రాష్ట్రంలో ఇప్పటి వరకూ 36 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. వారిలో ఒకరు డిస్ ఛార్జి అయ్యారని కేసీఆర్ చెప్పారు. దాదాపు 19 వేల మంది విదేశాల నుంచి వచ్చిన వారు తమ అధీనంలో ఉన్నారని, వారి పాస్ పోర్టులను కూడా సీజ్ చేయమని ఆదేశించామని చెప్పారు. కరోనా వైరస్ అనుమానితులు 114 మంది ఉన్నారని, అందులో 88 మంది విదేశాల నుంచి వచ్చారని, మిగిలిన వారికి వైరస్ సోకి ఉండవచ్చన్న అనుమానం ఉందన్నారు. కరోనా మహమ్మారి యావత్ ప్రపంచాన్ని వణికిస్తోందని, ఈ పరిస్థితుల్లో అందరూ అప్రమత్తంగా ఉండాలన్నారు.

ప్రజలు సహకరించకుంటే….

ప్రజాస్వామ్య దేశంలో ప్రజలకు మంచిగానే చెప్పి చూస్తామని, లేకుంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అమెరికా వంటి దేశాల్లో ప్రజలు సహకరించక పోవడంతో ఆర్మీని రంగంలోకి దించారన్నారు. ఇక్కడ కూడా 24 గంటలు కర్ఫ్యూ విధించాల్సి వస్తుందని, కనిపిస్తే కాల్చివేత ఉత్తర్వులు జారీ చేయాల్సి వస్తుందని హెచ్చరించారు. అవసరమైతే ఆర్మీని కూడా రంగంలోకి దించాల్సి వస్తుందన్నారు. ప్రజలే ఇందుకు సహకరించాలని కోరారు. ప్రభుత్వాన్ని మరిన్ని కఠిన చర్యలు తీసుకోకుండా ప్రజలే తగిన విధంగా వ్యవహరించాలన్నారు. అప్రమత్తతే ముఖ్యమని కోరారు.

ప్రజా ప్రతినిధులు ఏం చేస్తున్నారు?

అధికారులు మాత్రం కన్పిస్తున్నారని, ప్రజాప్రతినిధులు ఎక్కడికి వెళ్లారని కేసీఆర్ ప్రశ్నించారు. ప్రధానంగా ప్రజాప్రతినిధులు అందరూ రంగంలోకి దిగాలన్నారు. నియంత్రణలో పోలీసులకు ప్రజాప్రతినిధులు సహకరించాలన్నారు. హైదరాబాద్ పరిధిలోని కార్పొరేటర్లందరూ రంగంలోకి దిగి ప్రజలు రోడ్లమీదకు రాకుండా చూడాలన్నారు. ఆపత్కాల సమయంలో ప్రజల కోసం పనిచేయాలని కేసీఆర్ కోరారు. మంత్రులందరూ జిల్లా కేంద్రాల్లో, ఎమ్మెల్యేలు నియోజకవర్గ కేంద్రాల్లో ఉండి అధికారులతో సమన్వయం చేసుకోవాలని కేసీఆర్ పిలుపునిచ్చారు. గ్రామస్థాయిలో ప్రజాప్రతినిధులు క్రియాశీలం కావాలన్నారు. నిత్యావసరవస్తువులు రాష్ట్రంలో రావడానికి టోల్ ఫీజును ఈరోజు వరకు రద్దు చేస్తున్నామని కేసీఆర్ ప్రకటించారు.

ధరలు పెంచితే…?

అత్యవసర పరిస్థితుల్లోనే ప్రజలను అనుమతిస్తామని చెప్పారు. ఇందుకోసం డయల్ 100కు ఫోన్ చేయాలన్నారు. అవసరమైతే వాహనాలను కూడా ఏర్పాటు చేస్తామన్నారు. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, పంటలను ఖచ్చితంగా ప్రభుత్వం కొనుగోలు చేస్తుందన్నారు. జిల్లా కేంద్రంలోని మార్కెట్ యార్డులను మూసివేస్తున్నామని చెప్పారు. కూరగాయల ధరలు పెంచితే పీడీ యాక్ట్ పెట్టి జైల్లోకి పంపుతామని వార్నింగ్ ఇచ్చారు. నిత్యావసర వస్తువుల ధరలు పెంచినా దుకాణాలు సీజ్ చేసి అరెస్ట్ చేస్తామన్నారు. లైెసెన్సులు కూడా రద్దు చేస్తామని హెచ్చరించారు. తెలంగాణలో రాత్రి 7గంటల నుంచి ఉదయం 6గంటల వరకూ కర్ఫ్యూ విధిస్తున్నట్లు కేసీఆర్ ప్రకటించారు. అన్ని షాపులను ఆరు గంటలకే బంద్ చేయాలన్నారు. వ్యవసాయ పనులకు, ఇరిగేషన్ పనులకు మినహాయింపు ఉంటుందన్నారు. సమాజ హితం కోరి న్వయం నియంత్రణ పాటించాలని కేసీఆర్ మరోసారి ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రజలు మాట వినకపోతే పెట్రోలు బంకులు కూడా బంద్ చేయాల్సి ఉంటుందన్నారు. రోజుకు వందల కోట్ల నష్టం వస్తున్నా ప్రజారోగ్యం కోసం భరిస్తున్నామని తెలిపారు.

Tags:    

Similar News