సుహాసిని కోసం జూనియర్...??

Update: 2018-12-01 08:23 GMT

కూకట్ పల్లిలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి నందమూరి సుహాసిని ప్రచారానికి ఆమె తమ్ముళ్లు జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ దూరంగా ఉండనున్నట్లు తెలుస్తోంది. ఎవరూ ఊహించని విధంగా కూకట్ పల్లి బరిలో చంద్రబాబు సుహాసినిని దింపారు. వాస్తవానికి ఆమెకు అక్కడ తీవ్ర పోటీ ఉంది. టీఆర్ఎస్ అభ్యర్థి మాధవరం కృష్ణారావును గెలిపించేందుకు మంత్రి కేటీఆర్ తీవ్రంగా కృషి చేస్తున్నారు. ఇక ఏపీలో చంద్రబాబుకు వ్యతిరేకంగా ఉన్న జగన్ అభిమానులు కూడా సుహాసినికి వ్యతిరేకంగా పనిచేస్తున్నట్లు కనిపిస్తోంది. వారంతా టీఆర్ఎస్ కి ఓటేసే అవకాశం ఉంది. దీంతో చంద్రబాబు కూడా కూకట్ పల్లి స్థానాన్ని ప్రతిష్ఠాత్మకంగానే తీసుకున్నారు. ఏపీకి చెందిన పలువురు కీలక నేతలకు ఈ ఎన్నిక బాధ్యతలను అప్పగించారు. ఆయన కూడా స్వయంగా ప్రచారం చేయనున్నారు. బాలకృష్ణ కూడా సుహాసిని తరుపున ప్రచారానికి వస్తున్నారు.

దూరంగా ఉండటమే మేలు..!

ఓవైపు తమ సోదరి తరపున బాబాయ్ తో పాటు మామయ్య చంద్రబాబు ప్రచారం చేస్తుంటే జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ మాత్రం దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. ఆమె అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసిన రోజు ఇద్దరు కలిసి సంయుక్తంగా ఒక ప్రెస్ నోట్ విడుదల చేశారు. తమ సోదరి రాజకీయాల్లోకి రావడాన్ని స్వాగతిస్తున్నట్లు, వారి మద్దతు ఆమెకు ఉంటుందని, ఆమె రాణించాలని ఆకాంక్షించారు. అయితే, ఈ లేఖతోనే వారు సరిపెట్టనున్నారు. తెలంగాణలో టీఆర్ఎస్ బలంగా ఉన్నందున, కేసీఆర్, కేటీఆర్ లతో జూనియర్ ఎన్టీఆర్ కి మంచి అనుబంధమే ఉన్నందున ప్రచారానికి దూరంగా ఉండటమే మేలని వారు ఆలోచిస్తున్నారు. తమ తండ్రి హరికృష్ణ మరణించినప్పుడు కూడా కేసీఆర్, కేటీఆర్ వారిని ఓదార్చరు. ఇక, పోటీ తీవ్రంగా ఉన్నందున ఒకవేళ సుహాసిని ఓడిపోతే ఆ ప్రభావం జూనియర్ భవిష్యత్ మీద కూడా పడే అవకాశం ఉందని ఆయన గుర్తించారు. దీంతో సుహాసిని సోదరులు ప్రచారానికి దూరంగా ఉండటం ఖాయమైంది. అయితే, ఆమెకు మద్దతుగా మరో లేఖ రాసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Similar News