బ్రేకింగ్ : జగన్ పాదయాత్రకు పోలీసుల బ్రేక్...!

Update: 2018-06-09 08:50 GMT

జగన్ పాదయాత్ర దాదాపు ఏడు నెలలుగా సాగుతుంది. కాని ఎక్కడా లేని ఆటంకం తూర్పు గోదావరి జిల్లాలో వచ్చింది. జగన్ పాదయాత్ర మరో రెండు, మూడు రోజుల్లో తూర్పు గోదావరి జిల్లాలోకి ప్రవేశిస్తుంది. కొవ్వూరు నియోజకవర్గం నుంచి తూర్పు గోదావరి జిల్లాలో ప్రవేశించాలంటే గోదావరి వంతెనను దాటాలి. అయితే వంతెన బలహీనంగా ఉందని, పాదయాత్ర చేస్తే వంతెన ప్రమాదానికి లోనవుతుందని ప్రభుత్వం పాదయాత్రకు అనుమతిని నిరాకరించింది. ఈ మేరకు రాజమండ్రి డీఎస్పీ జగన్ కు లేఖ రాశారు. గోదావరి వంతెనపై నుంచి కాకుండా వేరే మార్గం ద్వారా రావాలని ఆయన కోరారు. బ్రిడ్జి కండిషన్ సరిగా లేనందునే అనుమతిని ఇవ్వడ లేదని పోలీసులు చెబుతున్నారు. శాంతి భద్రతల దృష్ట్యా రాజమండ్రిలో కూడా జగన్ బహిరంగ సభకు అనుమతించబోమని పోలీసులు చెబుతున్నారు. అయితే వైసీపీ నేతలు దీనిని తప్పుపడుతున్నారు. ప్రభుత్వం కావాలనే పాదయాత్రను అడ్డుకునే ప్రయత్నం చేస్తుందని ఆరోపిస్తున్నారు. ఈమేరకు వైసీపీ నేతలు పోలీసులతో చర్చలు జరుపుతున్నారు. పాదయాత్రకు అనుమతి నిరాకరిస్తే ఊరుకోబోమని వైసీపీ నేతలు హెచ్చరిస్తున్నారు.

Similar News