భారతీయులు తలదించుకునే విషయం చెప్పిన సర్వే

Update: 2018-06-26 07:56 GMT

భారతీయులంతా సిగ్గు పడే విషయాన్ని ఓ అమెరికన్ సర్వే వెల్లడించింది. స్త్రీని దేవతగా ఆరాధించే భారత దేశం నేడు ప్రపంచంలోనే స్త్రీలకు అత్యంత ప్రమాదకర దేశమని తేల్చింది. అంతర్యుద్ధాలతో అట్టుడుకుతున్న సిరియా, అఫ్ఘానిస్తాన్ వంటి దేశాలు సైతం భారత్ తర్వాతే నిలిచాయి అంటే మన దేశంలో మహిళల పరిస్థితి ఎంటో తెలుస్తోంది. అమెరికాకు చెందిన థామ్సన్ ర్యూటర్స్ ఫౌండేషన్ నిర్వహించిన ఈ సర్వేలో దిగ్భ్రాంతి కలిగించే అంశాలు వెల్లడయ్యాయి. అగ్రరాజ్యం అమెరికా జాబితాలో మూడో స్థానంలో నిలిచింది. అత్యాచారాలు, బలవంతంగా బానిసలుగా మార్చుకోవడం, లైంగిక వేదింపుల వల్ల భారత్ మహిళలకు ప్రమాదకర దేశంగా మారిందని సర్వే అభిప్రాయపడింది. ప్రపంచవ్యాప్తంగా మహిళలపై అకృత్యాలకు వ్యతిరేకంగా పనిచేస్తున్న 550 మంది అభిప్రాయాలను ఈ సర్వే కోసం తీసుకున్నారు.

ప్రతి గంటకు నాలుగు ఘటనలు...

2011లో జరిగిన సర్వే ఫలితాలే మళ్లీ ఇప్పుడు పునరావృతమయ్యాయని ఈ సంస్థ తెలిపింది. అప్పుడు అఫ్ఘానిస్తాన్, రిపబ్లిక్ ఆఫ్ కాంగో, పాకిస్థాన్, భారత్, సోమాలియా దేశాలు మహిళలకు అత్యంత ప్రమాదకర దేశాలు తేల్చింది. ఇప్పుడు నిర్వహించిన సర్వేలో భారత్ పరిస్థితులు ఇంకా దారుణంగా తయారై మొదటి స్థానంలో నిలిచిందని సర్వే వెల్లడించింది. 2007కు 2016కు పోల్చుకుంటే భారత్ లో మహిళలపై నేరాలు 83 శాతం పెరిగాయి. ప్రతి గంటకు నాలుగు కేసులు నమోదవుతున్నాయి. నిర్భయ ఘటన తర్వాత మహిళల భద్రత కోసం భారత్ తీసుకుంటున్న చర్యలు చాలవని ఈ సర్వే వెల్లడించింది. మహిళల అక్రమ రవాణా, శృంగార బానిసత్వం, గృహహింస, బలవంతపు వివాహాలు, ఆడపిల్లల బ్రుణ హత్యలు వంటి ఘటనల వల్ల భారత్ మహిళలకు ప్రమాదకరంగా మారిందనేది సర్వే అంచనా. అయితే, ఈ సర్వే ఫలితాలపై స్పందించేందుకు కేంద్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ నిరాకరించిందని సర్వే నిర్వహించిన సంస్థ వెల్లడించింది.

Similar News