సిద్ధంగా ఉన్నాం.. పాక్ చర్యలకు గట్టిగా బదులిస్తాం

పాకిస్తాన్ నుంచి ఎటువంటి చర్య ఉన్నా గట్టిగా తిప్పికొట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లు భారత త్రివిధ దళాల అధిపతులు ప్రకటించారు. గురువారం సాయంత్రం వారు సంయుక్తంగా మీడియాతో మాట్లాడారు. [more]

Update: 2019-02-28 14:10 GMT

పాకిస్తాన్ నుంచి ఎటువంటి చర్య ఉన్నా గట్టిగా తిప్పికొట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లు భారత త్రివిధ దళాల అధిపతులు ప్రకటించారు. గురువారం సాయంత్రం వారు సంయుక్తంగా మీడియాతో మాట్లాడారు. భారత్ లోకి చొరబడేందుకు నిన్న పాకిస్తాన్ భారత సైనిక స్థావరాలపై బాంబులు వేసిందని, అప్రమత్తంగా ఉన్న వాయుసేన వేగంగా స్పందించి పాక్ విమానాలను తిప్పికొట్టామని తెలిపారు. మన వాయుసేనకు చెందిన సుఖోయ్, మిరాజ్, మిగ్ 21 విమానాలు గగనతలానికి దూసుకెళ్లి రెండు పాక్ విమానాలను కూల్చేశాయని తెలిపారు. పాకిస్తాన్ అనేక అబద్ధాలు ఆడిందని, రెండు విమానాలను కూల్చారని, వారి వద్ద ఇద్దరు పైలట్లు ఉన్నట్లు తప్పుడు ప్రచారం చేసిందన్నారు. ఎఫ్-16 యుద్ధ విమానాలు వాడలేదని చెప్పిందని, కానీ పాక్ ఆ విమానాలు వాడినట్లు ఆధారాలు ఉన్నాయని స్పష్టం చేశారు. పాక్ అదుపులో ఉన్న పైలట్ అభినందన్ రేపు క్షేమంగా తిరిగి వస్తారని ఆశిస్తున్నట్లు ప్రకటించారు.

ఎయిర్ స్ట్రయిక్స్ కు ఆధారాలున్నాయి…

కేవలం పాక్ లోని ఉగ్రవాద శిబిరాలపైనే భారత్ దాడి చేసిందని, కానీ పాకిస్తాన్ మాత్రం భారత సైనిక స్థావరాలపై దాడికి ప్రయత్నించిందని ఆరోపించారు. 26వ తేదీ నుంచి పాక్ పదేపదే కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తుందని, పాక్ కాల్పులను ఎప్పటికప్పుడు తిప్పి కొడుతున్నామన్నారు. ఉగ్రవాదానికి ఊతమిస్తున్నంతవరకు దాడులు తప్పవని, ఉగ్రవాదులపై తమ యుద్ధం కొనసాగుతుందని హెచ్చరించారు. ఈ సందర్భంగా భారత్ కూల్చివేసిన పాక్ కు చెందిన ఎఫ్-16 విమానానికి సంబంధించి శకలాలను మీడియా ముందు ప్రదర్శించారు. దేశ రక్షణ కోసం జల, వాయు, భూతళాల్లో బలగాలు సిద్ధంగా ఉన్నాయని స్పష్టం చేశారు. ఇక బాలాకోట్ లో భారత్ చేసిన ఎయిర్ స్ట్రైక్ కు సంబంధించిన ఆధారాలు తమవద్ద ఉన్నాయని, అయితే అవి ఎప్పుడు విడుదల చేయాలనేది ప్రభుత్వం చేతిలో ఉంటుందని వారు తెలిపారు.

Tags:    

Similar News